నిత్యం ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హన్మంతు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులు కష్టపడినా 15వ తేదీ నాటికి కూడా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది కార్మికులు, ఉద్యోగులు సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడాది నుంచి ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్టీసీకి జీతాలు చెల్లించేవారని వెల్లడించారు. గత నెలలో 14వ తేదీన వేతనాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ వచ్చినా చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కార్మికులు నమ్మకంతో పనిచేసే పరిస్థితులు ఉండాలంటే సరైన సమయానికి ఆర్టీసీ యాజమాన్యం జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజులు కష్టపడి 15 రోజుల పాటు జీతాల కోసం వేచి చూడాల్సి వస్తోందని వివరించారు. ప్రతినెలా ఒకటో తేదీన ఆర్టీసీ జీతాలు చెల్లించాలన్నారు. లేని పక్షంలో రేపు అన్ని డిపోల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.