Tips to Crack Group Exams : తెలంగాణలో ఒకొక్కొటిగా దాదాపు అన్ని రంగాలకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాలకు పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రానున్న పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలని కొందరు అయోమయం చెందుతున్నారు. ఓవైపు ఉద్యోగం సాధించాలన్న పట్టుదల.. మరోవైపు ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థంకాని సందిగ్ధత.. అలాంటి వారి కోసమే కొన్ని సూచనలు. మరి ఇవి తెలుసుకొని జాబ్ కొట్టేయండి ఇక..
గ్రూప్ 1
ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన తర్వాతే అసలైన సందిగ్ధత సీరియస్ అభ్యర్థుల్లో కూడా ఏర్పడింది.
1. ప్రశ్నపత్రంలోని నూతన ధోరణి వల్ల అత్యధిక శాతం అభ్యర్థులు 60-65 మార్కులు మాత్రమే పొందుతున్నారు. ఫలితంగా తాము ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతామా లేదా అనే సందేహం. అర్హత పొందినట్లు అధికారిక ప్రకటన వస్తేనేగానీ ముందుకెళ్లలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఇతర నోటిఫికేషన్లకు స్పందించి వాటికి సిద్ధమవుదాం అనుకుంటే 500కు పైగా ఉన్న గ్రూప్ 1 ఉద్యోగాలు ఊరిస్తూనే ఉన్నాయి.
2. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కోర్టు కేసుల్లో నిర్దిష్టంగా సూచనలు రానందువల్ల వాటిపై అంతిమ తీర్పు ఎప్పుడొస్తుందో తెలియక చాలామంది ఇతర వ్యాపకాల్లోకి వెళ్లిపోతున్నారు.
3. ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసు కూడా హైకోర్టులో దాఖలైన నేపథ్యంలో గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుందా అనే సందేహంతో ఉన్నవారు అవకాశాలున్న ఇతర నోటిఫికేషన్లపై దృష్టి పెడుతున్నారు.
టాప్ ర్యాంకులు తెచ్చుకున్నప్పుడే RDO, DY SP మొదలైన ఉత్తమ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 పోటీ నుంచి తప్పుకుంటున్నవారిని చూస్తూ గుంపు మనస్తత్వంతో చాలామంది పోటీ నుంచి విరమిస్తున్నారు. ఇది సముచితం కాదు. ఉద్యోగాల తుది ఎంపిక అనేది మెరిట్ అభ్యర్థుల మధ్య మాత్రమే ఉంటుంది. ఆ మెరిట్ అభ్యర్థుల్లో, ఆయా రిజర్వేషన్ కేటగిరీల మెరిట్‌లో కూడా నిలబడాలంటే తప్పనిసరిగా కఠోర దీక్షతో ప్రిపేర్ అవ్వాలి.
గ్రూప్ 1 మెయిన్స్‌లోని 6 పేపర్లలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినప్పుడే టాప్ ర్యాంకర్లుగా మిగిలే అవకాశం ఉంటుంది. చక్కని దస్తూరి, భావ వ్యక్తీకరణ, సమయ నిర్వహణ, సరైన కంటెంట్ మాత్రమే గ్రూప్ 1 తరహా పరీక్షలో అంతిమ విజయాన్ని అందిస్తాయి. అందువల్ల గ్రూప్ 1 లక్ష్యంగా ఉన్న అభ్యర్థులు ప్రస్తుత సందిగ్ధత నుంచి బయటపడాలి. మెయిన్స్ పరీక్షలు ఎప్పుడు జరిగినా అత్యుత్తమ ప్రతిభను కనబర్చాలంటే నిరంతర సన్నద్ధతే మార్గం!
గ్రూప్ 2
ఈ నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా రావొచ్చని తెలుస్తోంది. 800 వరకు ఉద్యోగాలుండే అవకాశముంది. ఆబ్జెక్టివ్ పరీక్షల ద్వారా పరిపాలన ఉద్యోగాల్లో చేరే అత్యుత్తమ అవకాశమిది. అందువల్ల దీనిపై చాలామంది అభ్యర్థులు దృష్టి నిలుపుతారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల వల్ల చాలామంది ఇప్పటికే ప్రకటించిన గ్రూప్ 4 రాయాలా, గ్రూప్ 2 కోసమే ఎదురు చూడాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. ఇక్కడో విషయం గమనించాలి- గ్రూప్ 4 ఉద్యోగి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగంలోకి పదోన్నతి పొందాలంటే 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే ఒక నిరుద్యోగి గ్రూప్-2 ఉద్యోగాన్ని పొందితే జీవితంలో అంత సమయాన్ని పొదుపు చేసుకున్నట్లు. అందువల్ల గ్రూప్ 2 ప్రిపరేషన్‌ను సమర్థంగా కొనసాగిస్తే గ్రూప్-2 ఉద్యోగం పొందటమే కాదు, గ్రూప్ 3, 4 ఉద్యోగాలూ సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
‘గ్రూప్ 4 మీదే దృష్టి పెడితే గ్రూప్ 4 ఉద్యోగాల పోటీని సమర్థంగా ఎదుర్కొని కచ్చితంగా ఉద్యోగం పొందవచ్చు’ అనే భావనతో కొందరున్నారు. దాంతో వారు గ్రూప్ 2ని వదిలేసి గ్రూప్ 4 మీద దృష్టి పెడుతున్నారు. ఇది హేతుబద్ధమైన నిర్ణయం కాదు. గ్రూప్ 2 సిలబస్‌పై గట్టి పట్టు సాధించి సెక్రటేరియల్ ఎబిలిటీస్ కోసం అదనంగా గంట సమయం కేటాయిస్తే గ్రూప్ 2, 3, 4- పరీక్షలన్నీ సమర్థంగా ఎదుర్కొని ఉద్యోగం సాధించవచ్చు. వివిధ కారణాలవల్ల ఏదైనా పరీక్షను బాగా రాయపోయినా మిగతా రెండు పరీక్షలూ ఆదుకునే అవకాశం ఉంటుంది. ఇది గమనించి... సందేహాలన్నీ పక్కనపెట్టి గ్రూప్ 2 పరీక్షకు అత్యుత్తమ స్థాయిలో తయారైతే మెరుగైన భవిష్యత్తు సాధ్యమే.
అకడమిక్ పరీక్షల సంగతి?
చాలామంది పీజీ/ ఇతరత్రా ఉన్నతస్థాయి విద్యార్హతల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయా అకడమిక్ పరీక్షలు సాధారణంగా ఏప్రిల్ తర్వాత ఉంటాయి. ఇలాంటివారు ఆ పరీక్షలు ఎదుర్కోవాలా, ఈ పోటీ పరీక్షలు ఎదుర్కోవాలా అనే విషయంలో అస్పష్టతతో ఉన్నారు. ఏ కోర్సులో అయినా ఫైనలియర్ పరీక్షలు మాత్రమే రాస్తున్న అభ్యర్థులయితే ఆ కోర్సు పూర్తిచేసుకోవడానికి ప్రయత్నించాలి. కోర్సు పరీక్షలు 2023 చివరి నాలుగు మాసాల్లో రాసే అవకాశం ఉంటే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లపై దృష్టి పెట్టడం మంచిది. ప్రస్తుతం వెలువడుతున్న లక్ష ఉద్యోగాల్లో చాలామంది అభ్యర్థులు స్థిరపడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడుచుకోవటం తెలివైన నిర్ణయం కాబోదు. తప్పదనుకుంటే అకడమిక్ పరీక్షలు వదులుకోవడమే సరైన నిర్ణయం.
ప్రత్యేక సబ్జెక్టు ఆధారిత పరీక్షలు
DAO, AEE, AE, CDPO, EO,JL,PL మొదలైన ప్రత్యేక సబ్జెక్టు ఆధారిత పరీక్షలుండే చాలా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటన్నిటికీ పరీక్ష తేదీలు కూడా దాదాపు ఖరారయ్యాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ పరీక్షలు రాసే చాలామందిలో గ్రూప్ 1, 2 పరీక్షలు రాసి పరిపాలన ఉద్యోగాల్లో ప్రవేశించి పదోన్నతులతో ఎదగాలనుకునే వారున్నారు. అంటే వారి ప్రధాన దృష్టి గ్రూప్స్ పరీక్షలు. ఉద్యోగం అనేది ఒకటి పొందేందుకు ఈ నిర్దిష్ట నోటిఫికేషన్ మీద దృష్టి నిలుపుతున్నారు. అదే సందర్భంలో దీనిమీద ఫోకస్ పెడితే గ్రూప్ 1, 2 పరీక్షలను సమర్థంగా ఎదుర్కోలేమేమో అనే సందిగ్ధత! ఇలాంటి మనఃస్థితితో ఏ పరీక్ష మీదా పూర్తి దృష్టి కేటాయించలేకపోతున్నారు. ఇది సరికాదు.
రాబోయే రెండు మూడు నెలల్లోనే ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నందునా, పైగా ఈ పరీక్షల్లో సబ్జెక్టు ప్రత్యేకత ఉన్నందువల్లా పోటీ కూడా తక్కువగానే ఉంటుంది. ఇది గమనించి ఈ నోటిఫికేషన్ల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి సందేహాలకూ తావివ్వకుండా ప్రస్తుతం ఆ నోటిఫికేషన్ల మీదే దృష్టి పెట్టాలి. అటు జనరల్ స్టడీస్‌తో పాటు ఇటు ప్రత్యేక సబ్జెక్టుపై కూడా పూర్తి పట్టు సాధించినప్పుడే ఈ పరీక్షల్లో మంచి ర్యాంకు, తద్వారా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ ప్రత్యేక సబ్జెక్టు ఉన్న పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో ఒక అపోహ ఉంది. ‘సబ్జెక్టు పేపర్‌ని అత్యుత్తమంగా రాయడం ద్వారా ఉద్యోగం కొట్టొచ్చు’ అని. ఇది హేతుబద్ధమైన ఆలోచన కాదు. పోస్టు ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా ఆలోచన ఫలితాన్నిస్తుందేమో కానీ పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు కాదు. ప్రత్యేక సబ్జెక్టుతో పాటు జనరల్ స్టడీస్‌లోనూ గరిష్ఠంగా రాణించినప్పుడే సెలక్షన్‌కు అవకాశం ఉంటుంది. అందులోనూ ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా రద్దు చేసినందున రాత పరీక్షలో వచ్చే మార్కులే ప్రామాణికం. వీలైనంతగా శక్తుల్ని కేంద్రీకరించి ప్రత్యేక సబ్జెక్టు పేపర్‌నూ, జనరల్ స్టడీస్‌నూ సమర్థంగా ఎదుర్కొంటేనే ఉద్యోగం సాధ్యం. ఏ విధంగా చూసినా గ్రూప్ 1, 2 ఉద్యోగాల పరీక్షలు ఈ పరీక్షల తర్వాతే జరిగే అవకాశం ఉన్నందువల్ల ఎటువంటి సందిగ్ధతకూ గురి కాకుండా సిద్ధపడాలి.
డీఎస్సీ వర్సెస్ గ్రూప్స్
టెట్ పరీక్ష ముగిసింది. మార్కుల ప్రకటన కూడా జరిగింది. ఇక డీఎస్సీ తరువాయి అనుకుంటున్న తరుణంలో రకరకాల వార్తలు రావడంతో టీచర్ అభ్యర్థులు అసలు డీఎస్సీ పరీక్ష పెడతారా పెట్టరా అనే సందేహానికి గురవుతున్నారు. డీఎస్సీ పరీక్ష పోటీని ఎదుర్కోవాలంటే లోతైన ప్రిపరేషన్ తప్పనిసరి. 10,000 వరకు ఖాళీలుండవచ్చు అనే అంచనాల నేపథ్యంలో ఆశావహులు 5 లక్షలకు పైగా ఉండటంతో పోటీ తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే నోటిఫికేషన్ విడుదల సంగతి కచ్చితంగా లేకపోవటంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గ్రూప్ 4 పరీక్షకు సిద్ధపడదామా అంటే జనరల్ స్టడీస్ పేపర్ చాలా విస్తృతమైనది. ఒకవేళ జనరల్ స్టడీస్ పేపర్‌కి ప్రిపేర్ అవుతూవుంటే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తే రెండిటికీ కాకుండా పోతామేమో అనే భయం అభ్యర్థులను వేధిస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారం? డీఎస్సీ - గ్రూపుల ప్రిపరేషన్ దేనికదే విభిన్నమైనది కనుక ఏదో ఒక దానిమీదే దృష్టి పెట్టడం సరైన నిర్ణయం అవుతుంది. అవకాశం ఉంటే జేఎల్ పరీక్షకు సిద్ధపడటం కూడా ఓ ప్రత్యామ్నాయం.
ఇటీవల కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి దాదాపు 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రైమరీ టీచర్, టీజీటీ, పీజీటీ మొదలైన పోస్టులకు నియామకాలు జరిపే ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షలకు హాజరవటమనేది డీఎస్సీ సన్నద్ధత ట్రాక్ తప్పకుండా ఉండేందుకు ఉపయోగపడే ఆలోచన అని చెప్పవచ్చు.
"సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు కూడా అభ్యర్థులను అనేక సందిగ్ధతలకు గురిచేస్తున్నాయి. అందులో ప్రధానమైనది- ముందస్తు ఎన్నికలు. ‘ఎన్నికలు వస్తే ఇక చేయగలిగేదేముంటుంది, పరీక్షలు జరగవు’ అంటూ సాగే వదంతులు చూసి గందరగోళపడకూడదు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా నోటిఫికేషన్ గనుక విడుదలై ఉంటే ఆ పరీక్షలు నిర్వహించటానికి ఇబ్బందులు ఏమీ ఉండవని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడైనా పరీక్ష అభ్యర్థులే రాయాలి కనుక ఎటువంటి తికమకలకూ తావివ్వకుండా ఆశావహ దృక్పథంతో పరీక్షలకు సంసిద్ధమవటమే అభ్యర్థులపరంగా తెలివైన నిర్ణయం అవుతుంది." - కొడాలి భవానీ శంకర్