Tiger wandering in kakinada Villages: ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రజలను పెద్దపులి భయపెడుతోంది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆదివారం సాయంత్రమే పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన 150 మంది సిబ్బంది... ఆయా ప్రాంతాల్లో బోన్లు సిద్ధం చేశారు. పులిని బందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో రాత్రివేళల్లో ఎవరూ సంచరించవద్దని అధికారులు మరోసారి హెచ్చరించారు.
ప్రత్తిపాడు మండలం పోతులూరు వద్ద 80అడుగుల గుట్టపై పెద్దపులి తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు. రాత్రివేళల్లో సంచరిస్తున్న ఈ పులి.. సోమవారం రాత్రి ఎక్కడా సంచరించినట్లు ఆనవాలు కనిపించలేదు. పోతులూరు వద్ద ఉన్న గుట్టతో పాటు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లోనూ పులి జాడ చిక్కలేదు. అయితే గతంలో గేదెను వేటాడి గుట్టపైకి లాక్కెళ్లింది. ఇప్పుడు ఆహారం కోసం అక్కడకు వస్తుందేమోనని అటవీశాఖ అధికారులు తిష్టవేశారు.
పెద్దపులి ప్రత్తిపాడు మండలంలో రాత్రివేళ పశువులపై దాడి చేస్తూ.. నీరు తాగేందుకు స్థానికంగా ఉన్న కాల్వల వద్దకు వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇదే పులి ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, శరభవరం, ధర్మవరం గ్రామాల్లో పశువులపై దాడి చేసి ఆరు గేదెల్ని చంపేసిందని అధికారులు తెలిపారు. పులిని బంధించే చర్యల్లో భాగంగా.. పోతులూరు వద్ద స్థానిక సర్పంచ్‌లతో అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. పులిని బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అటవీశాఖ ముఖ్య అధికారి శరవణన్ ఆధ్వర్యంలో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు పులిని బంధించేందుకు ఇంకా కొన్ని రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. మరి పోలీసుల బోనుకు పులి చిక్కుతుందా.. లేక అడవిలోకి తిరిగి వెళ్తుందా చూడాలి.
ఇవీ చదవండి :