Ts Weather Report: ఈ రోజు ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగ్లాదేశ్- మయన్మార్ తీరంలో ఇది ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6కిమీ ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి రాగల 6గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు.
ఇది వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయం మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని సంచాలకులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని వివరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నెమ్మదిస్తున్న గోదావరి: మరోవైపు భద్రాచలం వద్ద ఉద్ధృతంగా పెరిగి 54 అడుగులు దాటి ప్రవహించిన నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 53.3 అడుగుల వద్ద ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. గతంలో కంటే నీటిమట్టం పెరగడంతో.. భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులపైకి వరద నీరు చేరడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా ముంపు మండలాలు జలదిగ్బంధంలోనే చిక్కుకొనే ఉన్నాయి.
జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.690గా ఉందని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. సాగర్‌లోకి లక్ష 17 క్యూసెక్కులు వస్తుండంగా అంతేమొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 584.80 అడుగులు ఉందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: గోదావరికి తగ్గిన వరద, కృష్ణాలోకి పోటెత్తుతున్న ప్రవాహం
సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి