బీహెచ్‌ఈఎల్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థి తండ్రి కూలీ. లాక్‌డౌన్‌తో ఆదాయం లేక పొట్టనిండని దైన్యం. ఈ పరిస్థితుల్లో వర్సిటీ పరీక్ష ఫీజు కట్టడం ఆ విద్యార్థికి తలకుమించిన భారంగా మారింది. గతేడాది జ్వరంతో పరీక్షలు సరిగా రాయలేక నాలుగు బ్యాక్‌లాగ్స్ వచ్చాయి. ప్రస్తుతం రెగ్యులర్ పరీక్షకు రూ.1,155, బ్యాక్‌లాగ్‌లకు రూ.1,155 కలిపితే రూ.2,310 పరీక్ష ఫీజు కట్టాలి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్ష ఫీజులపై వివాదం రేగింది. లాక్‌డౌన్‌తో విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతుండగా రూ.వేలల్లో ఫీజులు కట్టమనడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు. ప్రస్తుత సెమిస్టర్‌కు సంబంధించి పరీక్ష ఫీజులు తగ్గించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఉస్మానియా పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సులకు ఈనెల 13న వర్సిటీ పరీక్షల విభాగం నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే నెల పదో తేదీ వరకు ఫీజు కట్టేందుకు వీలుంది. వర్సిటీ పరిధిలో దాదాపు 2.10లక్షల మంది విద్యార్థులు యూజీ కోర్సులు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆర్థికంగా పేద కుటుంబాలకు చెందిన వారే. ఫీజుల్లో రాయితీ కల్పించే దిశగా విశ్వవిద్యాలయం, ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నారు.
పరీక్ష ఫీజు పెంచలేదు: ప్రొ.శ్రీరామ్‌వెంకటేశ్, వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి
ఏటా పరీక్ష రుసుం పది శాతం పెంచేందుకు వెసులుబాటు ఉంది. కరోనా కారణంగా ఈసారి పెంచలేదు. గతేడాది ఫీజులే వసూలు చేస్తున్నాం. రుసుంలు తగ్గించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫీజులపై ఆధారపడే పరీక్షల నిర్వహణ జరుగుతోంది. తగ్గిస్తే పరీక్షల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది.
గమనిక : వీటితోపాటు మెమో కోసం రూ.100 చెల్లించాలి. చివరి ఏడాది విద్యార్థులకు ప్రావిజినల్ సర్టిఫికెట్‌కు రూ.150, మార్కుల మెమోకు రూ.300 అదనం.