తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 11 నుంచి 19 వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో అధికారులు, సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేస్తారు.
అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నవంబరు 10వ తేదీన అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి. నవంబరు 20న పుష్పయాగం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు:
- 11-11-2020 (బుధవారం) ధ్వజారోహణం - చిన్నశేషవాహనం
- 12-11-2020 (గురువారం) పెద్దశేషవాహనం - హంసవాహనం
- 13-11-2020 (శుక్రవారం) ముత్యపుపందిరి వాహనం - సింహవాహనం
- 14-11-2020 (శనివారం) కల్పవృక్ష వాహనం -హనుమంతవాహనం
- 15-11-2020 (ఆదివారం) పల్లకీ ఉత్సవం - గజవాహనం
- 16-11-2020 (సోమవారం) సర్వభూపాలవాహనం- స్వర్ణరథం (సర్వభూపాల వాహనం) గరుడవాహనం
- 17-11-2020 (మంగళవారం) సూర్యప్రభ వాహనం-చంద్రప్రభ వాహనం
- 18-11-2020(బుధవారం) రథోత్సవం(సర్వభూపాల వాహనం)- అశ్వ వాహనం
- 19-11-2020 (గురువారం) పంచమితీర్థం (వాహనమండపంలో)-ధ్వజావరోహణం.
ఇదీ చూడండి: దుబ్బాక ఉపఎన్నిక కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: సిద్దిపేట సీపీ