Challenges in logistics hub problems hyderabad: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం హైదరాబాద్. ఎగుమతులు, దిగుమతులతో ఎప్పుడూ రద్దీగా ఉండే నగరానికి వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భారీ ట్రక్కులు సరకు రవాణా చేస్తుంటాయి. రోజురోజుకీ పెరుగుతున్న వ్యక్తిగత వాహనాలతో పాటు భారీ వాహనాలతో రద్దీ తీవ్రమవుతుండగా.. కాలుష్యమూ ముంచుకొస్తోంది. ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు యంత్రాంగం తీసుకొచ్చిన ప్రణాళికల్లో ఆరంభ శూరత్వమే కనిపిస్తోంది. నగరంలోకి వచ్చే భారీ వాహనాల్ని శివార్లలోనే ఆపి ఇటు రద్దీని, అటు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఐదేళ్ల కిందట తీసుకొచ్చిన లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటు ప్రతిపాదనదీ అదే పరిస్థితి.
ఐదేళ్లలో రెండే..
2016, జూలై 27న పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు(KTR review logistics hub in hyderabad) సమీక్షలో.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం చుట్టూ 12 లాజిస్టిక్ హబ్స్ అవసరమున్నాయని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(HMDA) అధికారులు ప్రతిపాదించారు. భారీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో పీపీపీ(PPE)లో ముందుకెళ్లాలని.. వీలైనన్ని ముందుగానే నిర్మించాలని మంత్రి ఆదేశించారు. ఆ తర్వాత సరకు రవాణా రంగంపై అధికారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, భూసేకరణ తదితర విషయాల్లో అడ్డంకులతో ఈవైపు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ దృష్టి సారించలేదు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం, హైదరాబాద్-నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై మంగళ్‌పల్లి వద్ద రెండు కేంద్రాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
భూమి దొరకలేదు!
Logistics hub issues in hyderabad: తొలుత మియాపూర్, పెద్ద అంబర్‌పేట, శంషాబాద్, శామీర్‌పేట, పటాన్‌చెరు, మనోహరాబాద్‌లలో ఆరు లాజిస్టిక్ పార్కులు పూర్తి చేయాలని యంత్రాంగం భావించింది. ప్రైవేటు కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించి భూముల సేకరణకు ప్రయత్నాలు చేయగా అది సాధ్యపడలేదు. శంషాబాద్‌లో 111జీవో అడ్డురాగా.. పెద్ద అంబర్‌పేట, శామీర్‌పేటల్లో అవసరమైన భూమి దొరకలేదని సమాచారం. మియాపూర్‌లో ఇంటర్‌సిటీ బస్ టర్మినల్ నిర్మాణానికే అడ్డంకులున్నాయి. మనోహరాబాద్‌లో అన్నీ ప్రైవేటు భూములే ఉండగా.. పటాన్‌చెరులో హెచ్‌ఎండీఏకు ఉన్న 17ఎకరాల భూమిలోనే ఓ ట్రక్ టర్మినల్‌ను ఏర్పాటు చేసినా దాన్ని ఎవరూ వినియోగించట్లేదు.
అభివృద్ధికి అడుగులు
సరకు రవాణా రంగంలో విస్తృత అవకాశాలుండగా ఈ హబ్‌ల నిర్మాణంతో నగరంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా అక్కడ సరకుతో వచ్చే డ్రైవర్లు, వ్యక్తుల కోసం సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఆసుపత్రి, ఆటోమొబైల్ దుకాణాలు, వాషింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ పంపులు ఇతర కేంద్రాలన్నీ ఏర్పడితే స్థానికంగా ఉపాధి కల్పన పెరుగుతుంది. అయితే భూముల వేలాలు, ఇతర పనుల మీద దృష్టి సారిస్తున్న యంత్రాంగం పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి.
శంషాబాద్‌లో మల్టీమోడల్ ఇంకొన్నేళ్లు!
శంషాబాద్ ఓఆర్‌ఆర్ సమీపంలో దాదాపు 300 ఎకరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్‌ను పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో నిర్మించేందుకు ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉందని.. అది పూర్తవగానే ప్రైవేటు ఏజెన్సీలు ముందుకొస్తే నిర్మాణం జరుగుతుందన్నారు. భూసేకరణకే ఇంకో ఏడాది పట్టగా.. నిర్మాణాలు పూర్తయి వసతులు అందుబాటులోకి వచ్చేందుకు కనీసం మూడు, నాలుగేళ్లు పడుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: tappachabutra rowdy sheeters attack: అర్ధరాత్రి రౌడీషీటర్ల వీరంగం.. రూ.37 లక్షల విలువైన మద్యం ధ్వంసం