Telangana Farmers problems : వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహం కరవైంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) కింద తెలంగాణలోని 25 బ్యాంకులు రూ.3075 కోట్ల రుణం ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. అయినా బ్యాంకులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేద్యం అనంతరం పంటలను నిల్వ చేసుకోవడంతో పాటు ఉత్పత్తులను శుద్ధిపరచి మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ని రూపొందించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ద్వారా రైతులకు ఈ నిధి కింద రాయితీలు, తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని కూడా కేంద్రం సంకల్పించింది.
Telangana agriculture sector : అయితే, రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకూ బ్యాంకులు ఏఐఎఫ్ కింద కేవలం 836 మందికే రూ.773.01 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. అందులో 560 మందికి మాత్రమే రూ.361.16 కోట్లు అందజేశాయి. రాష్ట్రంలోని 25 బ్యాంకుల్లో 9 బ్యాంకులు ఇంతవరకూ ఒక్కపైసా రుణాన్ని కూడా విదల్చలేదు. ఆ తొమ్మిది బ్యాంకుల్లో రెండు బ్యాంకులు ఏడుగురికి రూ.7.90 కోట్లు మంజూరు చేసినట్లు కాగితాల్లో చూపుతున్నా.. సొమ్మును మాత్రం ఇప్పటి వరకు విడుదల చేయలేదని కేంద్రానికి ఇచ్చిన తాజా నివేదికలో బ్యాంకర్ల సమితి వెల్లడించింది. రుణాల మంజూరు, అందజేతలో జాప్యం కారణంగా మౌలిక సదుపాయాల కల్పన పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
తక్కువ వడ్డీకే రుణాలు.. ఏఐఎఫ్ నుంచి కేవలం 4 శాతం వడ్డీకే బ్యాంకులు ప్యాక్స్‌లకు రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించింది. ఈ వడ్డీని సకాలంలో చెల్లిస్తే 3 శాతం రాయితీగా భరిస్తామని నాబార్డు సైతం తెలిపింది. రాష్ట్రంలో 906 ప్యాక్స్‌లు ఉండగా.. ఇప్పటివరకూ 300 సంఘాలకు మించి రుణాలను పొందలేదు. సేద్యానికి ఉపయోగపడే వ్యవసాయ యంత్రాల కొనుగోలు, పంటలు నిల్వ చేసుకోవడానికి వీలుగా చేపట్టే గోదాములు, శీతల గిడ్డంగులు, ప్యాక్‌హౌస్‌ల నిర్మాణాల కోసం బ్యాంకులు రైతు సంఘాలకు కూడా ఏఐఎఫ్ ద్వారా రూ.2 కోట్ల వరకు రుణం ఇవ్వాలి.
కేంద్రం బ్యాంకుల వారీగా రుణ లక్ష్యాన్ని నిర్ణయించింది. 25 బ్యాంకుల్లో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టీఎస్‌క్యాబ్) ఒక్కటే తనకు కేటాయించిన లక్ష్యంలో అత్యధికంగా 96.70 శాతం సొమ్మును రుణాలుగా మంజూరు చేసింది. దీని తరవాత ఎస్‌బీఐ 44.07 శాతం, యూబీఐ 45.18, కెనరా బ్యాంకు 35.15, హెచ్‌డీఎఫ్‌సీ 22.86 శాతం మాత్రమే రుణాలను మంజూరు చేశాయి. మిగిలిన కొన్ని బ్యాంకులు కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో ఒక్క పైసాను కూడా రుణంగా అందజేయలేదని బ్యాంకర్ల సమితి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. బ్యాంకులు ఏఐఎఫ్ కింద రుణాలు విడుదల చేస్తే గ్రామాల్లో వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరి రైతులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చూడండి..
పైసలిస్తేనే 'ఫ్రీ' కరెంట్.. ఇవ్వకపోతే సరఫరా బంద్
అప్రకటిత కరెంట్ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు