సంప్రదాయ డిగ్రీ కోర్సుల(Traditional Degree Courses)కు విద్యార్థుల ఆదరణ కరవైంది. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల్లో (Degree Admissions) ఈ ఏడాది కూడా సుమారు 2 లక్షలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 947 కళాశాలల్లో 4 లక్షల 16 వేల 575 డిగ్రీ సీట్ల ప్రవేశాల కోసం ఇప్పటి వరకు మూడు విడతల ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగింది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో 2 లక్షల 12 వేల 143 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా... లక్షా 96 వేల 691 మంది మాత్రమే కాలేజీలకు వెళ్లి చేరారు.
భారీగా సీట్లు మిగలడం వల్ల మరో విడత ప్రవేశాలను చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. ఈ నెలాఖరున ప్రత్యేక విడత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. అప్పటికీ మిగిలిన సీట్లను భర్తీ చేసుకొనే అవకాశం యాజమాన్యాలకు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆలోచిస్తోంది.
దోస్త్ గడువు పెంపు...
దోస్త్(dost)లో సీటు పొందిన అభ్యర్థులు కళాశాలలకు వెళ్లి చేరే గడువును ఈనెల 7 వరకు పొడిగించారు. మూడో విడతలో సీటు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు(dost reporting date extend) కూడా ఈనెల 7వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. నేటి వరకు 2 లక్షల 11 వేల 728 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా... వారిలో లక్షా 89 వేల 774 మంది కాలేజీల్లో చేరారు.
ఈ ఏడాది కూడా కామర్స్‌లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. కేటాయించిన సీట్లలో 39.43 శాతం కామర్స్ విద్యార్థులకే ఉన్నాయి. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో విద్యార్థులు సీటు పొందారు. ఈ సారి అబ్బాయిలకన్నా అమ్మాయిలే సంప్రదాయ డిగ్రీలో చేరేందుకు మొగ్గు చూపారు.
ఇదీ చూడండి: IT Raids on Hetero: హెటిరో సంస్థలపై ఐటీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం