ఆదిలాబాద్ జిల్లా కొంటపల్లికి చెందిన అజ్మీరా లక్ష్మణ్ అనే విద్యార్థి మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎం ఫార్మసీ చదువుతున్నాడు. నిందితుడు ఉప్పల్ విజయపురి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రేమించిన అమ్మాయితో జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఘట్‌కేసర్, మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షల సమయంలో విద్యార్థులు తమ ద్విచక్రవాహనాల డిక్కీలో భద్రపరిచిన చరవాణిలను ఎత్తుకెళ్లడం ప్రారంభించాడు.
చరవాణిలను దొంగలించడమే పని...
అందులో భాగంగా నారపల్లిలోని నల్ల మల్లారెడ్డి కళాశాల ఆవరణలోని ద్విచక్రవాహనంలో ఉన్న చరవాణిని చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడి నుంచి 20 చరవాణిలు, 2 ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. గతంలో ఉప్పల్ ఠాణా పరిధిలోనూ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.
ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం