Telangana Secretariat: సచివాలయ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి కొత్త సచివాలయ భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్... గతంలోనే ఇంజినీర్లు, గుత్తేదారుకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేశారు. మొత్తం 1,250 మంది కార్మికులు సచివాలయ పనుల్లో నిమగ్నమయ్యారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చివరి అంతస్థుకు సంబంధించిన స్లాబ్ పనులు జరుగుతున్నాయి. మిగతా అంతస్తుల స్లాబ్ పనులు పూర్తి కావడంతో ఇతర పనులు ప్రారంభించారు.
సమాంతరంగా...
నాలుగో అంతస్తు వరకు ఇటుక పని, ప్లాస్టరింగ్ కూడా పూర్తయ్యింది. రెండో అంతస్తు వరకు అంతర్గతంగా గోడలకు చేయాల్సిన పనులు కూడా పూర్తి చేశారు. చివరి అంతస్తు స్లాబ్ పనులు రెండు, మూడు రోజుల్లో పూర్తవవుతాయని అంటున్నారు. దాంతో స్ట్రక్చర్‌కు సంబంధించిన పనులు ఓ కొలిక్కి వచ్చినట్లవుతుంది. స్లాబ్ పనులను కొనసాగిస్తూనే ఇతర పనులను కూడా సమాంతరంగా చేపడుతున్నారు. అంతర్గత పనులు, టైల్స్, మార్బుల్స్ సహా ఇతరత్రా సామాగ్రిని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మంత్రులు, అధికారుల ఛాంబర్లు, వర్క్ స్టేషన్ నమునాలను కింది అంతస్తులో ఏర్పాటు చేశారు.
ధోల్‌పుర్ రాయి...
ఇటీవల రహదార్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి... ఆ నమూనాలను పరిశీలించి కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. ప్రధాన స్ట్రక్చర్ నిర్మాణం పూర్తైతే ఫ్రంట్ ఎలివేషన్, డోమ్‌ల నిర్మాణ పనులు చేపడతారు. ఇందుకు బాగానే సమయం పడుతుందని అంటున్నారు. ఫ్రంట్ ఎలివేషన్‌కు అవసరమైన రాజస్థాన్ ధోల్‌పూర్ రాయిని తెప్పించే పనులు ప్రారంభమయ్యాయి. రాతిని 60 రోజుల్లో తెప్పించాలని... ఇదే సమయంలో వాటి డిజైన్ పనులను సమాంతరంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఫర్నీచర్ మినహా మిగతా మెటీరియల్ నమూనాలు అన్నీ ఖరారయ్యాయి. దీంతో మెటిరీయల్ సేకరణ ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. అగ్నిమాపక వ్యవస్థకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీచూడండి: KCR Meet Tikait: 'ఫ్రంట్ గురించి చర్చించలేదు.. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే.. '