వర్షం పడితే చాలు హైదరాబాద్ నగరం (Hyderabad Rain Effect) వణికిపోతోంది. కొద్దిపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు చెరువులు, నదులను తలపించాయి. మలక్‌పేట్, చంపాపేట్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. అనేక చోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. హయత్‌నగర్‌లోని బంజారానగర్, అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్ కాలనీలు మొత్తం జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
ఆ మూడు కాలనీల సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. గత రెండేళ్లుగా వర్షం పడితే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు గోడు వెల్లబోసుకున్న పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
బిక్కుబిక్కుమంటూ...
రాత్రి కురిసిన వర్షానికి చంపాపేట్ రెడ్డికాలనీ, సరూర్ నగర్‌లోని కోదండరాం నగర్‌లను (Hyderabad Rain Effect) వరద ముంచెత్తింది. సరూర్‌నగర్ పైన ఉన్న చెరువులు అలుగులు పారడంతో వర్షపు నీటిలో ఈ ప్రాంతాలు చిక్కుకున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ఈ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచే వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రాత్రి నుంచే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. డ్రైనేజీలు ఉప్పొంగి వర్షపు నీటిలో కలిసి ఇళ్లలోకి రావడంతో దుర్వాసన వస్తోందని ఆవేదన చెందుతున్నారు. మరొక వైపు దోమలు వ్యాప్తి చెందుతాయని వాపోతున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారని రోగాలు ప్రబలే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు కూడా భారీ వర్షాలు...
ఇదే పరిస్థితి అన్ని లోతట్టు ప్రాంతాల్లో నెలకొంది. మూడు గంటల పాటు కురిసిన వర్షానికి భారీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటలో 14.6, నందిగామ 13.3, ఎల్బీనగర్ 11.3, హైదరాబాద్ జిల్లా (Hyderabad Rain Effect) సైదాబాద్ మండలం కుర్మగూడలో 13.1, నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డి పల్లి 11.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటి జనాభాకు అనుగుణంగా ఆధునీకరించాలని నగర ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.