Electricity Employees PRC Increased in Telangana: విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు గత కొన్ని రోజులుగా పలు డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో చర్చలు జరిపిన ఐకాస నేతలు.. మరోసారి నిన్న రాత్రి యాజమాన్యంతో సుదీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమాయ్యాయి. ఏడు శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు.
ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన సమ్మె విషయంలో.. తెలంగాణ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకొని.. సయోధ్య కుదుర్చాలని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కోరారు. ఏప్రిల్ 7వ తేదీన ఆయన.. లేబర్ కమిషనర్‌కు లేఖ రాశారు. టీఎస్ పీఈ ఐకాసతో ఇప్పటికే ఐదుసార్లు చర్చలు జరిపామని.. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆరు శాతం ఫిట్‌మెంట్‌కు ప్రతిపాదించామని వివరించారు.ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించడంతో తలపెట్టిన సమ్మెను విరమించారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన చర్చలు సాఫీగా జరిగాయని.. మరింత బాధ్యత మనపై పడిందని ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. వినియోగదారులపై భారం పడకుండా ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించాలని ఐకాస నేతలకు ప్రభాకర్ రావు సూచించారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సీఎండీ ప్రభాకర్ రావుకు విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఏడు శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం, యాజమాన్యం ఒప్పుకుంది. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీపైనా చర్చ జరిగింది. 1.4.2022 నుంచి కొత్త పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల మాకు ఈ పీఆర్సీ లభించింది. - శివాజీ, విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
పీఆర్సీపైన చర్చలు సఫలం అయ్యాయి. ఈ నెల 17 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నాం. యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. ఆర్టిజన్స్ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంకా సమస్యలు ఉంటే మళ్లీ చర్చించుకుందామని యాజమాన్యం చెప్పింది. -రత్నాకర్ రావు, పవర్ ఎంప్లాయ్ ఐకాస అధ్యక్షుడు
ఇవీ చదవండి: