తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని కేసీఆర్ విస్మరించి.. సీఎం పీఠం ఎక్కారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్ గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పలు బీసీ సంఘాల నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. కేటీఆర్‌ను సీఎం చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో... బీసీ నాయకుడైన ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం..
తెలంగాణ తొలి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల సమర్థవంతంగా తన విధులు నిర్వహించాడని తెలిపారు. కోవిడ్ విపత్కర సమయంలో.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజలకు ధైర్యాన్ని కల్పించిన ఈటల.. ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాల అర్హుడని తెలిపారు. జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు సీఎం పదవి కేటాయించకపోతే అమరవీరుల సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఒకే రోజు.. ఒక్క గంటలో కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు