ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉప ఎన్నిక వేడి మొదలైంది. వైకాపా ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మృతితో ఖాళీ అయిన లోక్‌సభ స్థానానికి... కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చి తేదీలు ఖరారు చేసింది. గెలుపునకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగుదేశం తరఫున పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్ బరిలో నిలిచారు. వైకాపా నుంచి సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపీ వైద్యుడు గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే ఈ ఉపఎన్నికల్లోనూ ఏకపక్ష ఫలితం పునరావృతం అవుతుందని... అధికారపక్షం ధీమా వ్యక్తం చేస్తోంది.
మూడు నెలల కిందటే పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తెలుగుదేశం... ప్రచారం ప్రారంభించింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించడం సహా.. ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించింది. పురపోరు ఫలితాలతో సంబంధం లేకుండా గెలుపు సాధిస్తామని పార్టీ నేతలు ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు.
జనసేన మద్దతుతో అభ్యర్థిని నిలబెట్టనున్న భాజపా... రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు పేర్లు పరిశీలిస్తోంది. ఎంపీగా జాతీయ పార్టీ అభ్యర్థిని ఎన్నుకుంటేనే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని భాజపా ప్రచారం చేయనుంది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 30న నామినేషన్లకు చివరి రోజు అయినందున... పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ఇదీ చదవండి: రండి.. త్వరపడండి.. పాత ఫోన్లకు రెండు గాజు గ్లాసులు!