రాష్ట్రంలోని బడులకు పాఠశాల విద్యాశాఖ ఈ నెల 6వ తేదీ నుంచి 17 వరకు దసరా సెలవులు ప్రకటించింది. పాఠశాలలు ఈ నెల 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధన మొదలుకాగా సెలవుల ప్రారంభం(6వ తేదీ) నాటికి 25 రోజులు మాత్రమే తరగతులు జరుగుతాయి. భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో తక్కువ రోజులు తరగతులు నిర్వహించారు. జూనియర్ కళాశాలలకు ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి బతుకమ్మ ఉత్సవాలు...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వ పరంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ నెల 6 నుంచి 13 వరకు మహిళా ఉద్యోగులు కార్యాలయాల్లో వేడుకలను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు. సాంస్కృతిక శాఖ సారథ్యంలో రూపొందించిన బతుకమ్మల పాటలను ఆయన ఆవిష్కరించారు. వీటికి ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించగా.. శృతి, వీణా, సితార నవీణ్, నాగదుర్గ పాటలు పాడి, నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, సంయుక్త కార్యదర్శి రమేశ్, సంచాలకుడు మామిడి హరికృష్ణ, టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, పలువురు నటీనటులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్