Tirupati Stampede Incident : తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు : తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. అనంతరం అనగాని మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని వాపోయారు. ఘటనకు కారణం తొందరపాటు చర్య? సమన్వయా లోపమా? అనేది విచారణలో తెలుస్తుందని చెప్పారు.
గాయపడిన వారికి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స : తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తొక్కిసలాటలో గాయపడిన వారు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పలువురు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం స్విమ్స్‌లో 13 మంది చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
డీఎస్పీ అత్యుత్సాహం కారణంగానే ఘటన : మరోవైపు ఈ ఘటనపై సీఎంకు తిరుపతి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం కారణంగా ఒక్కసారిగా భక్తులు వచ్చి తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా కూడా డీఎస్పీ సరిగా స్పందించలేదని, వెంటనే ఎస్పీ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి భక్తులకు సాయం చేశారని రిపోర్టులో తెలిపారు.
అంబులెన్స్ వాహనాన్ని టోకెన్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు అతడు అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందించారు. ఈ ఘటనపై టీటీడీ ఈవో సైతం స్పందించారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు.
వైకుంఠ ఏకాదశికి ముసాబైన తిరుమల - స్వామిని దర్శించుకోనున్న 7లక్షల భక్తులు
హైదరాబాద్ నుంచి కొత్త పర్యాటక ప్యాకేజీలు - ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా ప్లాన్!