పురపోరుపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టులో ఈరోజు మున్సిపల్ ఎన్నికల కేసు విచారణకు రానుంది. వార్డుల పునర్విభజనలో తప్పులు దొర్లాయని ఇదివరకే పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొన్ని చోట్ల ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులు లేని 69 పురపాలికల్లో ఎన్నికలకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.
ఒకేసారి విచారించండి..
అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారణ జరపాలని ఎస్ఈసీ ధర్మాసనాన్ని కోరగా.. ఇవాళ విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఈరోజు న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆధారంగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పోలింగ్ కేంద్రాల ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ ప్రకటించింది. కోర్టు కేసుల కారణంగా కొన్ని చోట్ల కేంద్రాల తుది జాబితా ప్రకటించలేదు.
23న తుది జాబితా..
ఈ నెల 9న పోలింగ్ కేంద్రాల ముసాయిదాను రూపొందించి 13న ప్రకటించనున్నారు. 16వ తేదీ వరకూ వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అదే రోజు మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తారు. ఆగస్టు 19లోగా అభ్యంతరాలు పరిష్కరించి.. 20న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించనున్నారు. 21న జిల్లా ఎన్నికల అథారిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. 23న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తారు. తుది జాబితా ప్రకటన తర్వాత ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే.. ఆ అధికారం కేవలం జిల్లా ఎన్నికల అథారిటీ అయిన కలెక్టర్కు ఉంటుంది.
ఇదీ చూడండి:'ఆర్టికల్ 370రద్దు'పై రాజ్యసభలో చర్చ ప్రత్యక్షప్రసారం