Kalti ice cream in hyderabad : హైదరాబాద్‌లో కల్తీరాయుళ్ల ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఓ వైపు చిన్నపిల్లలు తినే చాక్లెట్లు పెద్దఎత్తున కల్తీ చేస్తుండగా మరోవైపు వేసవిని అదునుగా చేసుకుని యథేచ్ఛగా కల్తీ ఐస్‌క్రీములు తయారు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ శివారులో ఐస్‌క్రీమ్ కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోని ఐస్‌క్రీం తయారు కేంద్రంపై శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ ఐస్‌క్రీం కుప్పలు, ముడిసరుకు బయటపడింది.
Kalti ice cream in hyderabad News : ధనార్జనే ధ్యేయంగా ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును చూసి, పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలి ఇష్టారీతిన తయారు చేస్తూ ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లోకి పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరిశ్రమలో అపరిశుభ్రమైన పరిస్థితులు, బోరు నీళ్లతో కనీస ప్రమాణాలు సైతం పాటించటంలేదని పైగా ఆకర్షణీమైన స్టిక్కర్లను అంటించి, గ్రామీణ ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి కల్తీ ఐస్‌క్రీమ్‌లు, వాటిని రవాణా చేసే వాహనాలు, ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా జీడిమెట్లలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. షాపూర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఓ షెడ్డును ఫిరోజ్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. డెలీషియస్ ఐస్‌క్రీం పేరుతో ఓ తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఐదుగురు కార్మికులను పనిలో పెట్టుకుని పెద్దఎత్తున ఐస్‌క్రీమ్‌లను తయారుచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాణాంతకమైన రసాయనాలు వాడుతూ ఇష్టారీతిన ముడిసరుకును ఉపయోగిస్తూ వీటిని తయారుచేస్తున్నారు. పక్కాసమాచారంతో బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులు దాడులు నిర్వహించగా కల్తీ దందా బయటికి వచ్చింది. 15 లక్షల విలువ చేసే సామగ్రితో పాటు 500 స్టికర్లను పోలీసులు సీజ్ చేసి, నిర్వాహకుడు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
"షాపూర్‌నగర్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ తయారుచేస్తున్నారన్న పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, జీడిమెట్ల పోలీసులు ఉమ్మడి బృందంగా ఏర్పడి ఫిరోజ్ అనే వ్యక్తిని పట్టుకున్నాం. సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. నగరంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు తినే ఐస్ క్రీమ్‌లో ఏ మాత్రం తేడా కనిపించినా వెంటనే మాకు ఫిర్యాదు చేయండి." -పవన్, జీడిమెట్ల సీఐ
నకిలీ బ్రాండ్ల పేరుతో ఇష్టారీతిన లేబుళ్లు అతికించి మార్కెట్లోకి వదులుతున్న ఇలాంటి ఐస్‌క్రీంలు, చాక్లెట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి చర్యలు గమనిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: