హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటుండటం అన్ని కార్యాలయాలు ప్రారంభించడం వల్ల మెట్రోకు ప్రయాణికుల ఆదరణ తిరిగి ప్రారంభమైంది. మరోవైపు మెట్రో ప్రయాణికులకు క్యాష్‌బ్యాక్, ఉచిత ట్రిప్పుల నేపథ్యంలో అదనంగా ప్రయాణిస్తున్నారు. దేశంలో అన్ని మెట్రోల కన్నా... దిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఈనెల మొదటివారం నుంచి మెట్రో సమయాన్ని కూడా పెంచడం వల్ల ఇది కలిసొచ్చింది.
పెట్రో మంటతో మెట్రోకే మొగ్గు
మెట్రో ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి చివరి ట్రైన్ రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు సేవలు అందిస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నుంచి మూసి ఉన్న భరత్‌నగర్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు కూడా తెరిచారు. దీనితో ఇక అన్ని కారిడార్లలో అన్ని స్టేషన్లు పునరుద్ధరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడం వల్ల మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది.
రోజుకు లక్ష 70వేల మంది ప్రయాణం
లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్‌లో మొదట మూడు కారిడార్లలో దశల వారీగా మెట్రో సేవలు ప్రారంభించి.. అన్ని కారిడార్లలో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో కొద్ది రోజులు మూడు కారిడార్లలో కలిపి కేవలం 30 వేల మంది వరకు మాత్రమే ప్రయాణాలు చేశారు. ఆ తర్వాత క్రమేనా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రోజుకు సరాసరి లక్ష 70 వేలకు పైగా ప్రయాణిస్తున్నారు. బస్ఛార్జీలతో పోల్చితే మెట్రో ఛార్జీలు ఎక్కువే అయినా.. ఇటీవల ఆఫర్లు ప్రకటించడంతో రైళ్లలో ప్రయాణాణికి జనాలు ఇష్టపడుతున్నారు. దీంతోపాటు మెట్రో స్టేషన్లలో కాంటాక్ట్ లెస్ టికెంటింగ్, కరోనా నిబంధనలు పక్కగా పాటిస్తున్నారు.
గతంలో కరోనాకు ముందు మెట్రోలో రోజున దాదాపు 4 లక్షల వరకు ప్రయాణించే వారు. మెట్రోను ఎక్కువ సంఖ్యలో ఆదరించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తున్నారు. వీరు సైతం మూనుపటిలా కార్యాలయాలకు వెల్లడం... ఇటూ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తే మునుపటిలా ప్రయాణికులు ఆదరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడాలి