Rythubandhu 5th day: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతోంది. 5వ రోజు రైతుబంధు కింద రూ.265.18 కోట్లు విడుదలయ్యాయి. సోమవారం 1,51,468 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆ నిధులు జమయ్యాయి. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాల విస్తీర్ణం భూములకు నిధులు విడుదల అయ్యాయి.
రైతుల కళ్లలో ఆనందమే కేసీఆర్ లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరంటు రాక, సాగు నీరు లేక రైతాంగం వ్యవసాయం వదిలేసి వలసబాట పట్టడమే కాకుండా... బోరు బావుల కింద వ్యవసాయం చేయలేక నష్టాల పాలైందని గుర్తు చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటి వరకు రైతు ఖాతాలో జమ చేసిన డబ్బుల వివరాలు:
రోజు | విడుదల చేసిన నిధులు(రూ.కోట్లలో) |
మెుదటి రోజు | రూ.607.32 |
రెండో రోజు | రూ.1218 |
మూడో రోజు | రూ.687.89 |
నాలుగవ రోజు | రూ.575 |
ఐదో రోజు | రూ.265.18 |
వ్యవసాయ రంగం బలపడితేనే దేశం పటిష్ఠం: కేవలం ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు చారిత్రాత్మకమైనవని స్పష్టం చేశారు. కీలక వ్యవసాయ రంగం బలపడితేనే దేశం పటిష్ఠంగా ఉంటుందని, తెలంగాణ పథకాలు చూసి దేశ రైతాంగం భారాస వైపు చూస్తుందని తెలిపారు. సంపద పెంచాలి... ప్రజలకు పంచాలి అన్నదే కేసీఆర్ విధానం అని అన్నారు.
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వృద్ధి : 47.75 లక్షల మందికి ప్రతి నెలా ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ... ఇందులో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారని చెప్పారు. 11.55 లక్షల మందికి కల్యాణ లక్ష్మి, 12.66 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. 2014లో 298 గురుకులాలు ఉంటే నేడు 1201 గురుకులాలు ఉన్నాయని, విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి రంగాలలో గణనీయమైన వృద్ధి సాధించామని అన్నారు. భారాస తరపున రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ తనదైన ముద్ర వేయడం ఖాయం అని మంత్రి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: