Ellampalli Sripadasagar project: ఎల్లంపల్లి శ్రీ పాదసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి పరిహారం లభించని వైనంపై వారం, పది రోజుల్లో విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన నిర్వాసితులు సోమవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌తో చర్చించి వారి విషయంపై పూర్తి వివరాలను మంత్రి తెలుసుకున్నారు.
ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదు: భూ సేకరణ చట్టం ప్రకారం భూమి హక్కు పట్టాలు ఇచ్చినప్పటికీ.. ఇళ్ల నిర్మాణానికి నిధులు రాలేదని నిర్వాసితులు తెలిపారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప.. తమకు న్యాయం జరగలేదని వాపోయారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 135 ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నట్లు 2009లోనే ప్రకటించినా చెల్లింపులు జరగలేదని వివరించారు.
సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొంటాం: గతంలో పైరవీ కార్ల మాటలను గ్రామస్థులు నమ్మడంతోనే ఇంత కాలం జాప్యం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని ఆయన అన్నారు. చెగ్యాం బాధితుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా గ్రామస్థులు ఐక్యంగా ఉండి ప్రభుత్వంతో కలిసి నడవాలని సూచించారు. చెగ్యాం గ్రామ నిర్వాసితుల సమస్యలపై వారం, పది రోజుల్లో విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ హామీ ఇచ్చారు.
"ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందా? రాదా? అన్నది తరవాత విషయం. ముందు వాళ్ల విన్నపం అధికారుల దగ్గరికి రావడానికి చాలా సమయం పడుతుంది. నిర్వాసితుల లిస్ట్ ముందు పంపించండి.. న్యాయం చేస్తాను. ఇప్పటి వరకు మా ప్రభుత్వం ఎంతో మందికి సాయం చేసింది. నిర్వాసితుల పక్షాన నిలబడి శాంతియుతంగానే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. దీనిపై వారం, పది రోజులు విచారణ జరిపించి అందరికీ న్యాయం జరిగేలా చేస్తాను."- కొప్పుల ఈశ్వర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి
- కొప్పుల ఈశ్వర్
ఇవీ చదవండి: