సైదాబాద్‌లో వైఎస్ షర్మిల (Ys Sharmila) దీక్ష కొనసాగుతోంది. సైదాబాద్‌లోని చిన్నారి ఇంటి వద్ద న్యాయం కోరుతూ ఉదయం నుంచి షర్మిల దీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ (Cm Kcr) స్పందించే వరకూ దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ షర్మిల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చిన్నారి ఇంటి సమీపంలో మధ్నాహ్నం నుంచి దీక్ష కొనసాగుతోంది. చంపాపేట వద్ద సాగర్ రోడ్డుపై వైతెపా కార్యకర్తలు బైఠాయించారు. చంపాపేట్, కర్మన్‌ఘాట్ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చిన్నారి తల్లిదండ్రులను వైఎస్ విజయమ్మ పరామర్శించి.. ఓదార్చారు. అనంతరం షర్మిల చేపట్టిన దీక్షకు వైఎస్ విజయమ్మ (Ys Vijayamma) సంఘీభావం తెలిపారు. దీక్షా స్థలికి చేరుకుని ఆమెకు మద్దతుగా నిలిచారు.
పోలీసులు వైఫల్యమే ఇది...
ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే చర్యలు తీసుకున్నారని... కానీ ప్రజలు అంటేనే లెక్కలేదని షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదని... బారులు, బీర్ల తెలంగాణగా మారిపోయిందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో నీళ్లు దొరకవు కానీ.. మద్యం దొరుకుతుందని మండిపడ్డారు. ఈ ఘటన పోలీసుల వైఫల్యమేనని.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. లాఠీఛార్జీ చేసి చిన్నారి శవాన్ని తీసుకెళ్లి.. తల్లిదండ్రుల అనుమతి లేకుండా పోస్టుమార్టం చేయించారని.. ఇంత వరకూ ఆ నివేదిక ఇవ్వలేదని ఆక్షేపించారు.
పోలీసులు ప్రజల కోసం పనిచేయకుండా కేసీఆర్‌కు తొత్తుల్లా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 9న చిన్నారిపై పాశవికంగా రాజు అనే కామాంధుడు.. అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. రాజును పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నా.. పట్టుబడకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. నిందితుడు రాజును పట్టిస్తే పది లక్షల రివార్డును అందిస్తామని పోలీసులు మంగళవారం ప్రకటించారు.
ఇదీ చూడండి: Saidabad rape case: 'సీఎం కేసీఆర్ స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తా..'