హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు నిలిపివేతపై హైకోర్టు..(High court on Dalitha bandhu) తీర్పును రిజర్వ్ చేసింది. దళితబంధును కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. భాజపా నేత ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్, మల్లేపల్లి లక్ష్మయ్య దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను.. సీజే జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం కలిపి విచారించింది.
ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందు నుంచే దళితబంధు(High court on Dalitha bandhu) అమలవుతోందని.... కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం దళితబంధు నిలిపేయాలని ఆదేశించడం సరైంది కాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. పథకం నిలిపేయడం వల్ల నిరుపేద దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయవాది రఘునాథ్.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి కాకుండా... కేవలం దశాబ్దాల తరబడి వివక్షకు గురవుతున్న దళితులకు మాత్రమే ఈ పథకం అమలు చేస్తోందని వివరించారు. దీన్ని నిలిపేయాలంటూ సీఈసీ లేఖ విడుదల చేయడం సరైంది కాదని రఘునాథ్ వాదించారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
ఇదీ చదవండి: KCR speech in trs plenary: ఏపీలో మీ పార్టీ పెట్టండి.. గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు: కేసీఆర్