హైదరాబాద్ టాటానగర్, శాస్త్రినగర్‌లో ఉన్న కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిందేనని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి చర్యలు చేపట్టకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేదాకా పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ప్రాంతంలోని కాలుష్య పరిశ్రమలకు రెండు వారాల్లో నోటీసులు జారీ చేయాలని మహానగర పాలక సంస్థను ఆదేశించింది.
వివరణ ఇవ్వాలి...
వారంలోగా ఆయా పరిశ్రమలు వివరణ ఇవ్వాలని... పరిశ్రమల వివరణ అందిన 14 రోజుల్లో దానిపై ఉత్తర్వులు ఇవ్వాలని... జీహెచ్‌ఎంసీకి ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు శాఖ ఉత్తర్వుల్లో కింది కోర్టులు జోక్యం చేసుకోరాదని హైకోర్టు తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే పరిశ్రమల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 20కి వాయిదా...
ఈ మొత్తం వ్యవహారంపై ఎన్ని పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు? ఎన్ని సమాధానం ఇచ్చాయి? ఎన్నింటిపై మూసివేత చర్యలు చేపట్టారు? వంటి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురంలో కాలుష్య పరిశ్రమలపై దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు జీహెచ్‌ఎంసీ అప్పీళ్లు, పరిశ్రమలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
పుట్టగొడుగుల్లా పరిశ్రమలు...
జనావాసాల్లో పుట్టగొడుగుల్లా కాలుష్య పరిశ్రమలు వెలుస్తున్నప్పటికీ... అధికారులు పట్టించుకోలేదని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యాక కళ్లు తెరిచారా అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. శాస్త్రినగర్‌లో 30 ఎకరాల్లో కాలుష్య పరిశ్రమలున్నాయని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి నివేదిక సమర్పించారంది.
ఇదీ చదవండి: భాజపాలో చేరడం లేదు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి