పుర ఎన్నికలు సజావుగా, జాగ్రత్తగా నిర్వహించాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చేపట్టిన విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఈసీ కార్యదర్శి హాజరయ్యారు. విధుల్లో 2,557 మంది పోలీసులు సహా 7,695 మంది ఉద్యోగులున్నట్లు కోర్టుకు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేసింది. కరోనా వేళ ఎన్నికలు వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధాకరమని, గతంలో హైదరాబాద్ మేయర్ స్థానం ఏడాదిన్నర ఖాళీగా ఉంది కదా అని ప్రశ్నించింది. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ఫణంగా పెట్టి ఎన్నికల నిర్వహణ అవసరమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.
ఉద్యోగులకు చేస్తారా? చస్తారా అనే పరిస్థితి కల్పించారని.. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే ఎస్‌ఈసీ దృష్టి ఎన్నికలపై ఉందని, ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహంపై ఉన్నారేమో అంటూ చురకలంటించింది. ప్రభుత్వం కూడా ఎన్నికలకు సన్నద్ధత వ్యక్తం చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. నియంత్రణ చర్యలు, ఆంక్షలపై రేపు చెబుతామని హైకోర్టును ఏజీ కోరారు. రేపు కలెక్టర్లు, అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహిస్తారని, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వాదనల అనంతరం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణను మే 5కు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?: హైకోర్టు