Supreme Court on TS Govt Pending Bills Petition : తెలంగాణ ప్రభుత్వం గత నెలలో 2022 సెప్టెంబరు 14 నుంచి 2023 ఫిబ్రవరి13 మధ్యకాలంలో 10 బిల్లులను పంపినా ఇంతవరకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చిన ఆ పిటిషన్‌ను.. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం... 2 వారాలకు వాయిదా వేసింది. కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదించారని తెలిపిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... వివరాలు కోర్టుకు సమర్పించారు. 3 బిల్లులను గవర్నర్ సెప్టెంబర్ నుంచి పెండింగ్‌లో పెట్టారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.
విచారణ రెండు వారాలు వాయిదా : ఈ అంశంపై ఏప్రిల్ 9న గవర్నర్ సచివాలయం నుంచి నివేదిక అందిందని.. దానిని సీజేఐ రికార్డు చేసిందని ఆయన చెప్పారు. కొన్ని బిల్లులపై ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరినట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో గవర్నర్ సచివాలయం పేర్కొంది. పంచాయితీరాజ్ చట్టసవరణ బిల్లుతో పాటు అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత సవరణ బిల్లులపై వివరణ కోరామని... సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో గవర్నర్ పేర్కొన్నారు. న్యాయశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదని గవర్నర్ సచివాలయం పేర్కొంది. వాదనలు ముగిసిన అనంతరం ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో ధర్మాసనం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మూడు బిల్లులు ఆమోదించిన గవర్నర్ : మరోవైపు పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయంలో కొంతమేర కదలిక వచ్చింది. మూడు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. రెండు బిల్లులను పున:పరిశీలన నిమిత్తం వెనక్కు తిప్పి పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపగా... ఇంకో రెండు బిల్లులపై గవర్నర్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అయితే ఏ బిల్లులను ఆమోదించారు, వేటిని తిరస్కరించారన్న విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గవర్నర్ వద్ద పది బిల్లులు పెండింగ్‌లో ఉండగా... వాటిని ఆమోదించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం దారుణం : బిల్లుల ఆమోదం అంశంలో గవర్నర్ తీరుపై... బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రం చేతిలో కీలు బొమ్మగా... గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ పలువురు మంత్రులు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను సైతం స్వార్థ రాజకీయాలకు వాడుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గవర్నర్ దగ్గర బిల్లులు... కోర్టులో కేసులు వేస్తేగానీ ఆమోదం కానీ పరిస్థితి తెలంగాణలో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ అన్ని వ్యవస్థలను తన ఆధీనంలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్దిని అడ్డుకుంటుందని ఆరోపించారు. ఫారెస్ట్ యూనివర్సిటీ కోసం క్యాబినెట్ ఆమోదించిందన్న హరీశ్... గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి వద్దకు పంపారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గవర్నర్ దెబ్బతీస్తున్నారన్న ఆయన... వెనుక నుంచి బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు.
ఇవీ చదవండి: