అత్యంత వెనకబడిన దళితజాతి సముద్ధరణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని చేపట్టింది. పైలట్ పద్ధతిన ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు మండలాల్లోనూ పైలట్ ప్రాజెక్టు అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని కూడా నిర్వహించారు.
30 రకాల ఉపాధి యూనిట్లు...
హుజూరాబాద్‌లో విస్తృత సర్వే నిర్వహించిన అధికారులు లబ్దిదారుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేశారు. వారి ఆసక్తిని తెలుసుకొని వారికి ఇష్టమైన యూనిట్లను నమోదు చేశారు. ఇప్పటికే పలువురు లబ్దిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను అందించారు. ట్రాక్టర్లు, కార్లు, మినీ డెయిరీలు, సూపర్ బజార్లు, ఇలా వివిధ యూనిట్లు అందులో ఉన్నాయి. మొత్తం 30 రకాల ఉపాధి యూనిట్లు ఉన్నాయి. హుజూరాబాద్ అనుభవం నేపథ్యంలో లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు విషయంలో మరింత శాస్త్రీయంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
మరోమారు కౌన్సెలింగ్...
హుజూరాబాద్‌లో 3,200 మంది చొప్పున ట్రాక్టర్లు, కార్లు తీసుకునేందుకు లబ్దిదారులు ముందుకొచ్చారు. ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు, కార్లు తీసుకుంటే ఫలితం ఉండదని... లబ్దిదారులకు మరోమారు కౌన్సెలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో లబ్ధిదారులకు వివరించారు. నాలుగు మండలాల సన్నాహక సమావేశంలోనూ యూనిట్ల ఎంపిక అంశం చర్చకు వచ్చింది. చాలా మంది ఎక్కువగా ట్రాక్టర్లు, కార్లు, తదితర సేవారంగాలకు సంబంధించిన యూనిట్లపై ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. అయితే సేవారంగానికి సంబంధించినవి కాకుండా తయారీ రంగం యూనిట్లను ప్రోత్సహిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.
వాటిని ప్రోత్సహించండి...
డెయిరీ యూనిట్లను వీలైనంత ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ సహకార డెయిరీలు ఉన్న నేపథ్యంలో ఇది అన్ని రకాలుగా సజావుగా సాగుతుందని, ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. డెయిరీ రంగానికి మంచి డిమాండ్, భవిష్యత్ ఉందని... ప్రజలకు కూడా మంచి పాలు, పాల ఉత్పత్తులు లభిస్తాయని అన్నారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ, పశుసంవర్ధకశాఖ, ప్రభుత్వ సహకార డెయిరీలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. దళితబంధులో డెయిరీ యూనిట్లు ప్రొత్సహించేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ డైరీ యూనిట్లు ప్రోత్సహించాలని చెప్పారు. దళితబంధు లబ్దిదారులు డెయిరీ యూనిట్లు, డెయిరీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే అవకాశం ఉన్న చోట ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయిస్తామని కూడా సీఎం చెప్పారు.
ఇదీ చూడండి: CM KCR: దశల వారీగా రాష్ట్రమంతా దళితబంధు.. ఏటా బడ్జెట్లో కేటాయింపులు