ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రుణమాఫీలో భాగంగా 25వేల లోపు రుణాలు ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో మాఫీ నగదు చేయాలని మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణమాఫీ అమలుపై ఇరువురు మంత్రులు ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులతో సమీక్షించారు. 25 వేల లోపు రుణాల ఏకమొత్తం మాఫీకి 1200 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ ఇప్పటికే విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఆరు లక్షల పదివేల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని మంత్రలు అధికారులకు స్పష్టం చేశారు. 25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల్లోపు రుణాలు ఉన్న వారికి నాలుగు విడతల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు.
రైతుబంధు సాయం
ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులు తెలిపారు. వానాకాలం పంటకు రైతుబంధు సాయంపై కూడా మంత్రులు అధికారులతో సమీక్షించారు. జూన్ మాసంలో రైతుబంధు కోసం ఇవ్వాల్సిన ఏడు వేల కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. నిధుల విడుదలతో రైతుల బ్యాంకుఖాతాల్లో రైతుబంధు సాయం నగదును జమచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రైతుబంధు కింద ఏడు వేల కోట్ల రూపాయలను నెలరోజుల్లో పంట సీజన్ ప్రారంభమయ్యే నాటికల్లా రైతులకు అందించాలని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.
51 లక్షల మంది రైతులకు
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అవసరమైతే ఇతర ఖర్చులు తగ్గించుకొనైనా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలోని 51 లక్షల మంది రైతులకు డబ్బు నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతుందని చెప్పారు.
ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!