అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధుల(నాన్ కమ్యునికబుల్ డిసీజెస్- Ncd)కు వైద్యమందించేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, పక్షవాతం లాంటి జీవనశైలి లేదా అసాంక్రమిక వ్యాధులకు జిల్లా ఆసుపత్రుల్లో ఇప్పటికే చికిత్సలు అందిస్తున్నా.. ప్రత్యేక ఓపీ కేంద్రం లేకపోవడం పెద్దలోటుగా ఉంది.
ఎన్‌సీడీ క్లినిక్‌లు...
దీన్ని సరిదిద్దేందుకు అసాంక్రమిక వ్యాధుల నివారణ, నియంత్రణ పథకం కింద రాష్ట్రంలోని 33 జిల్లా ఆసుపత్రుల్లోనూ ప్రత్యేకంగా ఎన్‌సీడీ క్లినిక్(Ncd Clinic)లు నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సిరిసిల్ల, సంగారెడ్డి, బోధన్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, వనపర్తి సహా మొత్తంగా 14 జిల్లా ఆసుపత్రుల్లో వీటి ఏర్పాటు కోసం ఒక్కో దానికి రూ.2.5-4లక్షల వరకూ మంజూరు చేసింది. ఈ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతుండగా..మిగిలిన జిల్లా కేంద్ర ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాలు సహా 101 వైద్యశాలల్లోనూ ఈ క్లినిక్‌లు నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ఇంటింటికీ వెళ్లి పరీక్షలు..
జీవనశైలి వ్యాధులను అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ గ్రామాల్లో అధిక రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలను నిర్వహిస్తుండడంతో అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి. 30 ఏళ్ల్లు పైబడినవారిలో ఈ పరీక్షలు చేస్తున్నారు. ప్రాథమికంగా అధిక రక్తపోటు, మధుమేహం ఉందని నిర్ధారణ అయిన వారిని మరిన్ని పరీక్షలు, వైద్యుల సంప్రదింపుల కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తున్నారు.
సరికొత్త ఆలోచనకు శ్రీకారం..
గత రెండేళ్లుగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం తొలిదశ విజయవంతమవ్వగా.. కొవిడ్‌తో మలిదశ తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ పరీక్షల్లో నోరు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లు 2 శాతం, అధిక రక్తపోటు 20 శాతం, షుగర్ 7 శాతం వరకూ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఇటీవల విడుదలైన జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే-5లోనూ మహిళల్లో అధిక రక్తపోటు 20 శాతం, పురుషుల్లో 27 శాతంగా నమోదైంది. ఇదే సర్వేలో మహిళల్లో మధుమేహం 6 శాతం, పురుషుల్లో 7 శాతంగా పేర్కొన్నారు. బాధితులు నెలనెలా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి మందులు స్వీకరించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. బాధితులకు అవసరమైన ఔషధాలను ప్రత్యేక కిట్ రూపంలో అందజేస్తోంది.
జిల్లా ఆసుపత్రుల బలోపేతం..
* ఎన్‌సీడీ క్లినిక్‌లలో సేవలందించేందుకు ప్రతి జిల్లా ఆసుపత్రికి అదనంగా ఇద్దరు.. ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్క స్టాఫ్‌నర్సును నియమించనున్నారు.
* ప్రభుత్వ వైద్యంలో ఇప్పటికే నియమితులైన జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్‌లు ఈ క్లినిక్‌ల్లోనూ నిర్దేశిత తేదీల్లో ఓపీ సేవలు అందిస్తుంటారు.
* అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించేందుకు వీలుగా కొల్పోస్కోపీ, క్రయోథెరపీ పరికరాలను సమకూర్చారు.
* రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారించేందుకు తొలిదశలో 10 జిల్లా ఆసుపత్రుల్లో మ్యామోగ్రామ్ పరికరాన్ని అందుబాటులోకి తేనున్నారు. దీని విలువ సుమారు రూ.40 లక్షలు. దశల వారీగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయనున్నారు.
* ఎన్‌సీడీ క్లినిక్‌ల్లో అత్యవసర ఖర్చు కోసం ఒక్కో జిల్లా ఆసుపత్రికి ఏడాదికి రూ.లక్ష, ప్రాంతీయ దవాఖానాకు రూ.50వేల చొప్పున అందజేస్తున్నారు.
* జిల్లా ఆసుపత్రుల్లో దశల వారీగా గుండెపోటు బాధితులకు అత్యవసర చికిత్సనందించే కేంద్రాలను (కార్డియాక్ కేర్ యూనిట్-సీసీయూ) నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రికి రూ.1.55 కోట్లు అందజేయాలని సర్కారు నిర్ణయించింది.
* ఔషధాలు, ఇతర వినియోగ సామగ్రి కోసం ఎన్‌సీడీ క్లినిక్‌లకు ఏడాదికి రూ.12 లక్షలు ఇవ్వనున్నారు. క్యాన్సర్ రోగుల మందులకు రూ.18 లక్షలు.. సీఓపీడీ రోగుల కోసం రూ.25 లక్షలు ఖర్చుపెడతారు.
ఇదీ చూడండి: