గతంలో ఇచ్చిన హామీలు సహా పెండింగ్ అంశాల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దిశగా సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కీలకమైన భూ రికార్డుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ భూముల లావాదేవీలకు అమలు చేస్తున్న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక చాలా సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గతంలో జరిగిన పొరపాట్లు, ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలు, తదితర కారణంగా భూ యజమానాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందుకోసం ధరణి పోర్టల్‌లో కొన్ని మాడ్యూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చినా.. అన్ని సమస్యలకు పరిష్కారం లభించలేదు.
మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు, కేబినెట్‌లో చర్చ, ములుగు పైలట్ పద్ధతిన సమస్యల పరిష్కారం, తదితర ప్రయత్నాలు జరిగాయి. తాజాగా భూ రికార్డులకు సంబంధించి సమస్యల పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. మండలం యూనిట్‌గా బృందాలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు. ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి..? వాటి కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల బృందాలు దృష్టి సారిస్తాయి.
కొత్త పింఛన్లపై నిర్ణయం..: అటు ఆసరా పింఛన్లకు సంబంధించీ ముఖ్యమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తామని 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ.. అది ఇంకా నెరవేరలేదు. దాంతో పాటు కొత్త పింఛన్లూ మంజూరు కాలేదు. దీంతో అర్హులు చాలా మంది కొత్త ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 13 లక్షల మందికి పైగా కొత్తగా పింఛన్లు పొందే అవకాశం ఉంది.
వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలపైనా..: కరోనా, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ అంశాన్ని పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. తాజాగా ఆసరా ఫించన్ల విషయలోనూ సీఎం త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. పలువురు మంత్రులు ఈ మేరకు బహిరంగంగా ప్రకటనలూ చేస్తున్నారు. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థికసాయం పథకానికి సంబంధించీ త్వరలోనే విధానపర ప్రకటన ఉండవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా చర్యలు ప్రారంభించే అవకాశముంది. వీటితో పాటు వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల విషయంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాసనసభ, బహిరంగ సభలు, జిల్లా పర్యటనలు, సమీక్షల సందర్భంగా ఇచ్చిన హామీలను క్రోడీకరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. వాటన్నింటి అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆర్థిక పరిస్థితులే అడ్డంకిగా మారాయని.. వాటిని బేరీజు వేసుకొని ఆయన ముందుకెళ్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చూడండి..
'సర్కారు పరిస్థితేంటీ..? ప్రత్యర్థులు ఎవరు..?' తెరాసలో సర్వేల సందడి..