హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని సబ్జీమండిలో నిర్వహిస్తున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోంది. గంగపుత్ర మహిళలు చేసిన వంటకాల రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి తరలి వస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఫుడ్ మేళా చేపట్టినట్లు మత్స్యసహకార సంఘం అధ్యక్షురాలు శోభ బెస్త వెల్లడించారు.
గత ఏడాది హైదరాబాద్ మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ స్ఫూర్తిగా సబ్జి మండిలో ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందని నగర మత్స్య సహకార సొసైటీ ఛైర్పర్సన్ కొప్పు పద్మ బెస్త అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో సుమారు 40 రకాల చేపల పులుసు, చేప వేపుడు, హోల్ ఫిష్ , రొయ్యల వేపుడు, ఫిష్ లొలి పాప్, ఫిష్ బిర్యానీ, ఫిష్ కట్ లేట్, ఫిష్ కబాబ్ తదితర రుచులు అందుబాటులో ఉన్నాయని సంఘం అధ్యక్షురాలు విద్య బెస్త తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్జి మండి గంగపుత్ర మహిళా సంఘం, మహిళా మత్స్య సహకార సంఘం నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా ధర రూ.250: కేంద్రం