ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల బదిలీ అయింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు ..ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
సీఎం జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరంబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, టైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
జడ్చర్ల సెజ్‌లో అరబిందో, హెటిరో సంస్థలకు భూ కేటాయింపుల్లో క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ, ఈడీ అభియోగం. అరబిందో, హెటిరో సంస్థలకు చెరో 75 ఎకరాలను ధరల నిర్ణయాక కమిటీ నిర్ణయానికి విరుద్ధంగా ఎకరం రూ.7లక్షల చొప్పున వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కేటాయించినట్టు సీబీఐ, ఈడీ చార్జ్‌షీట్లలో పేర్కొన్నాయి.
మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో సంస్థకు గతంలో ఏపీఐఐసీ కేటాయించిన 30 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌కు బదలాయించినట్టు మరో అభియోగం. దాని వల్ల అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి బావమరిది పి.శరత్ చంద్రారెడ్డి ఎండీగా ఉన్న ట్రైడెంట్ సంస్థ రూ.4.33 కోట్లు అక్రమంగా లబ్ధి పొందినట్టు అభియోగం.
వీటికి ప్రతిఫలంగా అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి రూ.10కోట్లు, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి రూ.17.25 కోట్లు జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ ఫ్రా సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించారని సీబీఐ, ఈడీ అభియోగ పత్రాల సారాంశం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేసిన ఈడీ.. హెటిరో, అరబిందో, జననీ ఇన్ ఫ్రా, జగతి పబ్లికేషన్స్ కు చెందిన సుమారు రూ.51 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసి స్వాధీనం చేసుకోగా.. వాటిపై అప్పీలేట్ ట్రైబ్యునల్ స్టే ఇచ్చింది.
అప్పీలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అరబిందో, హెటిరోకు భూకేటాయింపులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2016లో నాంపల్లి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా.. ఇటీవల సీబీఐ, ఈడీ కోర్టుకు బదిలీ అయింది.
ఇదీ చదవండి: గోవధపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు: రాజాసింగ్