నమ్మకంగా ఉన్న డ్రైవర్ రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారైన ఘటన ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లో నివాసం ఉండే రాధిక అనే మహిళ నగల వ్యాపారం చేస్తుంటారు. వజ్రాభరణాలు అవసరమైన వారికి ప్రముఖ నగల దుకాణాల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేస్తుంటారు. ఆమె వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉంటుండటంతో అప్పుడప్పుడు కస్టమర్ల ఆర్డర్లను అతడితో పంపించేవారు. ఈ క్రమంలోనే ఆభరణాలపై కన్నేసిన శ్రీనివాస్.. అందుకు పథక రచన చేసుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు.
అయితే శ్రీనివాస్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సమయం శుక్రవారం రానే వచ్చింది. రాధిక ఉండే అపార్ట్‌మెంట్స్‌లోనే నివసించే అనూష అనే కస్టమర్ రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆర్డరు చేశారు. తీరా ఆర్డర్ డెలివరీ సమయంలో తాను ఇంట్లో లేనని.. మధురానగర్‌లో ఉన్న తన బంధువుల ఇంట్లో ఉన్నానని చెప్పారు. నగలను అక్కడికే పంపాలని కోరారు. దీంతో రాధిక డ్రైవర్ శ్రీనివాస్, సేల్స్‌మెన్ అక్షయ్‌లతో మొత్తం రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలను పంపించారు. అందులో రూ.50 లక్షల విలువ చేసే నగలు అనూషవి కాగా.. మిగిలినవి సిరిగిరిరాజ్ జెమ్స్ అండ్ జువెల్లర్స్‌లో తిరిగి ఇవ్వాల్సి ఉంది.
మధురానగర్‌లోని అనూష బంధువుల ఇంటికి చేరుకున్నాక శ్రీనివాస్ తన పథకాన్ని అమలు చేశాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తాను కారులోనే ఉండి.. ఆర్డర్ ఇవ్వడానికని అక్షయ్‌ను ఇంట్లోకి పంపాడు. అతడు కస్టమర్‌కు ఆభరణాలు ఇచ్చి వచ్చేలోగా వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. అక్షయ్ ద్వారా విషయం తెలుసుకున్న యజమాని రాధిక వెంటనే ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ ఎత్తుకెళ్లిన నగల విలువ దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని పోలీసులకు బాధితురాలు తెలిపారు.
ఇవీ చూడండి..
రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఆర్మీ కాంట్రాక్ట్, న్యూడ్ వీడియోలతో దోచేశారు..