ప్రత్యక్ష తరగతులు(TS SCHOOLS REOPEN) సెప్టెంబరు 1 నుంచి మొదలవుతున్న నేపథ్యంలో ఈసారి తరగతి గదుల్లో కనీసం ఆరు అడుగుల వ్యక్తిగత దూరం(physical distance) పాటించాలన్న నిబంధన లేదా? ఈ ప్రశ్నకు విద్యాశాఖ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లోనూ దీనిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. తరగతి గది పరిమాణాన్ని బట్టి భౌతిక దూరం పాటించేలా ప్రధానోపాధ్యాయులు సీటింగ్ ప్రణాళిక రూపొందించాలని మాత్రమే పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha indra reddy), పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(errabelli dayakar rao) మంగళవారం ఉదయం కలెక్టర్లు, విద్య, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
భిన్నాభిప్రాయాలు
ఈ సందర్భంగా ఓ డీఈవో ‘తమ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో 1200-1400 మంది విద్యార్థులుంటారని, చిన్న గదులుంటాయని, భౌతికదూరం పాటించడం కష్టమవుతుందని’ మంత్రుల దృష్టికి తెచ్చారు. షిఫ్టు విధానంలో నిర్వహణకు అనుమతి కోరారు. మంత్రి మాట్లాడుతూ, ‘దూరం ఆరడుగులా, రెండడుగులా అనేది మేం చెప్పలేం. సాధ్యమైనంత దూరం ఉండేలా చూసుకోండి. మాస్కులు ధరించేలా చూడండి’ అని సమాధానమిచ్చినట్టు తెలిసింది. షిఫ్టు విధానం వద్దని స్పష్టంచేసినట్లు సమాచారం. గతంలో తరగతి గదిలో 50% మందే ఉండాలని మార్గదర్శకాలు ఇవ్వగా.. ఈసారి ఆవిషయాన్నీ ప్రస్తావించలేదు. తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉండాలా వద్దా అనేదీ స్పష్టంచేయలేదు. ఈ నిర్ణయాలపై విద్యాశాఖ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు పక్కపక్కన కూర్చుని జాగ్రత్తగా ఉంటారా? అని ఓ విద్యాశాఖ అధికారి అనుమానం వ్యక్తం చేయగా.. విడతల వారీగా తరగతులను ప్రారంభిస్తే బాగుండేదని ఓ డీఈవో అభిప్రాయపడ్డారు.

విద్యాశాఖ మార్గదర్శకాల విడుదల
రాష్ట్ర ప్రభుత్వ(ts government) నిర్ణయం నేపథ్యంలో సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలవుతాయని విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన మార్గదర్శకాలను విడుదల చేశారు. కొవిడ్(covid) రక్షణ చర్యల్లో భాగంగా వసతిగృహాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం(mid day meals) సమయంలో పిల్లలు గుంపులుగా చేరకుండా వేర్వేరు సమయాలు ఉండేలా చూడాలన్నారు.
ఆన్‌లైన్ తరగతులు ఉండవు: మంత్రి సబిత
‘ఇక ఆన్‌లైన్ తరగతులు ఉండవు. ఆఫ్‌లైన్(ప్రత్యక్ష) తరగతులు మాత్రమే ఉంటాయి’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్ తరగతులు వద్దని తల్లిదండ్రులే చెబుతున్నారని, అందుకే ఈసారి ప్రత్యక్ష తరగతులనే ప్రారంభిస్తామన్నారు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా? లేక ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందా? అన్నది స్పష్టం చేయలేదు.
టీవీ పాఠాలు కొనసాగిస్తారా? అని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారిని ‘ఈనాడు-ఈటీవీభారత్’ సోమవారం అడగగా, ‘గత ఫిబ్రవరిలో ప్రత్యక్ష తరగతులు నడిపినప్పుడు కూడా టీవీ పాఠాలు ఉన్నాయని, ఈసారి కూడా ఉంటాయని’ సమాధానమిచ్చారు. మంగళవారం మంత్రి మాత్రం ఆన్‌లైన్ బోధన ఉండదని కుండబద్ధలు కొట్టడం గమనార్హం. మార్గదర్శకాల్లో కూడా ఆఫ్‌లైన్ తరగతుల గురించి ప్రస్తావించిన విద్యాశాఖ ఆన్‌లైన్ పాఠాలు ఉండవనే విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. దీన్నిబట్టి టీవీ పాఠాలు ఉంటాయా? ఉండవా? అనే విషయంపైనా స్పష్టత కొరవడింది.
బడి శుభ్రంగా.. విద్యార్థులు భద్రంగా..
రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. కరోనా(corona) ప్రభావంతో నెలలుగా మూతపడిన తరగతి గదులను తెరిచి శుభ్రం(sanitation) చేస్తున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులను, బల్లలను మంగళవారం పైపు పెట్టి నీళ్లతో కడుగుతూ సిబ్బంది ఇలా కనిపించారు.

ఇదీ చదవండి: TS EAMCET RESULTS: నేడు ఎంసెట్ ఫలితాలు విడుదల