వరి సన్నరకాలనే సాగుచేయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పలుమార్లు సమీక్షలు జరిపి సన్నరకాల వరి సాగుచేసేలా రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. కానీ చివరికి సగం విస్తీర్ణానికి మించి రైతులు వేయలేదు. దీనికి అనేక కారణాలున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గత వానాకాలం సీజన్లో మొత్తం 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో సుమారు 70 శాతం సన్నరకాలే వేశారని వ్యవసాయశాఖ అప్పట్లో చెప్పింది. ఆ లెక్కన గత ఏడాది దాదాపు 35 లక్షల ఎకరాల్లో ఆ రకం సాగయినట్లు లెక్క. అప్పటితో పోలిస్తే ఈసారి విస్తీర్ణం తగ్గడం చర్చనీయాంశమైంది. ఉప్పుడు బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ పరిమితులు విధిస్తున్న నేపథ్యంలో రబీ సీజనుకైనా సన్నరకాలపై దృష్టి సారిస్తారా అనేది వేచి చూడాలి.
దొడ్డు రకాల వైపే రైతుల మొగ్గు
* నల్గొండ జిల్లా కనగల్ మండలంలో 22,658 ఎకరాల్లో వరి వేస్తే ఒక్క శాతం (293 ఎకరాల్లో) మాత్రమే సన్నరకాలు సాగుచేశారు.కట్టంగూర్ మండలంలో దొడ్డురకాలు 14,983 ఎకరాల్లో వేస్తే సన్నరకం 531 ఎకరాలకే పరిమితమైంది.
* సన్నాలు ఎక్కువగా వేసే పెద్దపల్లి జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగైతే సన్నరకాలు లక్ష ఎకరాలకే పరిమితమయ్యాయి.
సన్న వరి పెరగకపోవడానికి కొన్ని కారణాలు...
* రాయితీపై వరి విత్తనాల అమ్మకాలను వ్యవసాయశాఖ నిలిపివేసింది.
* సన్నరకాల విత్తనాలను ప్రైవేటు కంపెనీలు అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. క్వింటాకు రూ. 4,500 దాకా వసూలు చేస్తున్నాయి.
* గతంలో వ్యవసాయశాఖ ఒక్కో క్వింటా విత్తనాల ధరలో రూ. 1,000 రాయితీగా భరించేది. అది నిలిపివేయడంతో రైతులపై భారం పెరిగింది.
* ఏ గ్రేడ్ కింద దొడ్డురకం ధాన్యానికి క్వింటాకు రూ. 1,960 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం.. సన్నరకం ధాన్యానికి రూ. 1,940 మాత్రమే ఇస్తోంది.
* దొడ్డు రకాలతో పోలిస్తే సన్నరకాల దిగుబడి, ధరలు తక్కువని సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.
తెగుళ్లతో అధిక నష్టాలు
రాష్ట్రంలో దొడ్డురకాల వరి వంగడాలనే రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. గత రెండేళ్లుగా అధిక వర్షాల వల్ల సన్నరకం వరిపైరుకు కాటుక తెగులు, బ్యాక్టీరియాతో ఎండుతెగులు అధికంగా సోకి రైతులు నష్టపోతున్నారు. దిగుబడులు తక్కువగా వస్తున్నాయి. ఈ రకాల సాగు కాలం 150 రోజుల దాకా ఉంటుంది. అంతకాలం పైరును కాపాడాల్సి రావడం వల్ల పెట్టుబడి ఖర్చులు ఎక్కువై పెద్దగా మిగలడం లేదని రైతులు ఆసక్తి చూపడం లేదు.
- డాక్టర్ జగదీశ్వర్, వరి ప్రధాన శాస్త్రవేత్త, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ