తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ అరుదైన ఘనత సాధించింది. ఈ శాఖకు ఏకంగా 7 జాతీయ ఉత్తమ అవార్డులు లభించాయి. మూడు కేటగిరీల్లోనూ జనరల్ కోటాలో తెలంగాణ సత్తా చాటింది. కేంద్రం ప్రకటించిన అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ హవా కొనసాగింది. ఈ అవార్డులు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడు అవార్డులు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాల పేరిట అవార్డులు ప్రకటిస్తుంది.
జిల్లా, బ్లాక్, మండలం, గ్రామ పంచాయతీల వారీగా ఈ అవార్డులను ప్రకటించారు. కేటగిరీల వారీగా మొదటి కేటగిరీలో నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్గా, రెండో కేటగిరీలో గ్రామ పంచాయతీ డెవలప్ మెంట్ ప్లాన్ అవార్డు, మూడో కేటగిరీలో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ అవార్డుల పేరుతో ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సంజీబ్ పత్ జోషీ అవార్డులను ప్రకటించారు.