రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల డ్యాంల నిర్వహణ, భద్రత, మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించనుంది. ప్రపంచబ్యాంకు నిధులతో డ్యాం రీహాబిలిటేషన్, ఇంప్రూవింగ్ ప్రాజెక్టు-డ్రిప్(DRIP REHABILITATION AND IMPROVING PROJECT- DRIP) రెండు, మూడో దశల్లో రాష్ట్రానికి సంబంధించిన 29 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి కేంద్ర మంత్రివర్గం గతంలోనే ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సమ్మతి తెలపాల్సి ఉంది.
70శాతం నిధులు
ఇటీవల దిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లకు జరిగిన సమావేశానికి కొనసాగింపుగా హైదరాబాద్ జలసౌధలో భేటీ జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో కేంద్ర జలసంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. రూ. 665 కోట్ల వ్యయంలోని 70 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా అందించనుంది. ఆర్థిక సహకారంతో పాటు సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తుంది.
ఐఐటీ రూర్కీ సహకారంతో ఇంజినీర్లకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని కూడా కేంద్రం అమలు చేస్తుంది. దీంతో డ్యాంల నిర్వహణ, భద్రత, మరమ్మతులకు సంబంధించి ఇంజినీర్లు ఎంటెక్ కోర్సు చదివేందుకు అవకాశం ఉంటుంది. వీటన్నింటికి సంబంధించిన విధివిధానాలు, రాష్ట్రం నుంచి సమర్పించాల్సిన వివరాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి తర్వాత డ్రిప్ రెండు, మూడో దశలను అమలు చేస్తారు.
ఇదీ చదవండి: CM KCR: 'మెట్రోను మరింత విస్తరించే దిశగా చర్యలు చేపడతాం'