Agnipath : త్రివిధ దళాల్లో మమేకమై దేశానికి సేవచేయాలని భావిస్తున్న యువతకు కేంద్రం చక్కని అవకాశమిస్తోంది. తొలిసారిగా నాలుగేళ్ల కాలపరిమితితో ‘అగ్నిపథ్’ పేరిట ఓ సర్వీసును ప్రారంభించనుంది. వారికి సాంకేతిక నైపుణ్యం అందించడంతో పాటు క్రమశిక్షణ కలిగినవారిగా తీర్చిదిద్దనుంది. ‘అగ్నిపథ్’ కింద తొలిబ్యాచ్‌లో 45వేల మందికి అవకాశమిచ్చేందుకు త్వరలో టూర్ ఆఫ్ డ్యూటీ(టీవోడీ) పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించనుంది.
అర్హులైన 17.5 నుంచి 21 ఏళ్ల మధ్యవయస్కులైన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ఆరునెలలు శిక్షణ ఇచ్చి, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తుంది. ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశమివ్వనుంది. అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాన్నీ ఇస్తుంది. అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ మంజూరుతో పాటు పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేయనుంది. ఈ నెలలోనే అగ్నిపథ్ నియామకానికి సంబంధించి ప్రకటన వెలువరించే అవకాశాలున్నట్లు రక్షణవర్గాలు వెల్లడించాయి.
ప్రవేశం ఇలా: వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ప్రతిబ్యాచ్‌లో 25శాతం మందికే ఈ అవకాశం దక్కుతుంది. అగ్నివీరులుగా ఎంపికైన వారికి ఏదైనా రెజిమెంట్, యూనిట్, సంస్థలో పోస్టింగ్‌తో పాటు సైనిక బలగాల తరహాలో ర్యాంకు ఇస్తారు. సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు లభిస్తాయి. పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని సేవానిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తనవంతు జమచేస్తుంది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఏకమొత్తంగా రూ. 11.71 లక్షల నిధి(పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణసదుపాయం కల్పిస్తుంది.
తగ్గనున్న ఆర్థిక భారం: ‘అగ్నిపథ్’ను అధికారులు, సైనికుల విభాగాల్లో ప్రారంభించాలని మూడేళ్ల క్రితమే భావించారు. రెండేళ్లుగా కరోనా కారణంగా అమలుకు నోచలేదు. తాజాగా సైనికుల విభాగం వరకు అమలుచేయాలని నిర్ణయించింది. తద్వారా ఆర్మీలో వేతనాలు, పింఛన్ల భారం తగ్గించవచ్చని భావిస్తోంది. మిగులు నిధులతో ఆర్మీ ఆధునికీకరణకు వెసులుబాటు లభించనుంది. తక్కువ కాలపరిమితి(షార్ట్) సర్వీసు కమిషన్ కింద యువతకు అవకాశం ఇవ్వడంతో ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్లలో సగటు వయసు 35-36 ఏళ్ల నుంచి 25-26 ఏళ్లకు తగ్గనుంది.
![](https://assets.eenadu.net/article_img/130622gh-main11b.jpg)