నల్గొండ జిల్లా విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(వైటీపీఎస్) వరకు రైలుమార్గం, కృష్ణానది నుంచి వైటీపీఎస్ వరకు పైప్‌లైన్ల ఏర్పాటుకు 13.26 హెక్టార్ల అటవీ భూమి అవసరం. ఎంతో కీలకమైన ఆ ప్రాజెక్టులకు భూముల కోసం దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా అటవీ అనుమతులు లభించని పరిస్థితి.
కరీంనగర్ జిల్లా ఎక్లాస్‌పూర్ నుంచి 5.2 కి.మీ. మేర నిర్మించే బీటీ రహదారికి 3.26 హెక్టార్ల అటవీభూమి అవసరం. ఆరేళ్లు గడుస్తున్నా అనుమతులకు మోక్షం లభించలేదు.. ఇవే కాదు, ఇలా వందలాది దరఖాస్తులు అటవీ అనుమతుల కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నాయి. అటవీశాఖ వీటిని పారదర్శకంగా, వేగంగా పరిష్కరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పాతుకుపోయి సైంధవ పాత్ర పోషిస్తున్న ఓ అధికారి ధోరణే ఇందుకు కారణమంటూ ఆరోపణలున్నాయి.
డీసీఎఫ్ (డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) హోదాలో ఉన్న ఆ అధికారి ఆయా ప్రాజెక్టులు, నిర్మాణ పనులకు అటవీ అనుమతులకు సంబంధించిన దస్త్రాలను నచ్చినట్లుగా నడిపిస్తూ, చక్రం తిప్పుతుంటారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా అనేక దరఖాస్తులకు మోక్షం లభించట్లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా ప్రాజెక్టుల ఆలస్యం, నిర్మాణ వ్యయం అంచనాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.
సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, రహదారుల నిర్మాణం.. నీటి కాలువలు, తాగునీటి పైప్‌లైన్లు, గనుల తవ్వకాలు, ఫైబర్ ఆప్టికల్ కేబుల్, సౌరవిద్యుత్తు, పవర్ ప్లాంట్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు.. ఇలా వివిధ అవసరాలకు భూమి ఎంతో అవసరం. ఆయా ప్రాజెక్టులు, లైన్ల ఏర్పాటు ప్రాంతంలో పలుచోట్ల అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని రక్షిత అటవీప్రాంతాలు(రిజర్వు ఫారెస్ట్), మరికొన్ని సాధారణ అటవీ ప్రాంతాలు. ఆయా ప్రాజెక్టులు, పనుల కారణంగా ఎంత అటవీభూమి పోతుంది, ఎన్ని చెట్లను నరకాల్సి ఉంటుంది వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
కోల్పోయిన అటవీప్రాంతానికి ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు, అక్కడ పచ్చదనం పెంచేందుకు పరిహారం చెల్లింపు వంటి లెక్కలుంటాయి. ఈ ప్రక్రియలో అటవీ అనుమతులు వేగంగా వస్తే- ఆయా ప్రాజెక్టులు, పనులు కూడా అంతే వేగంగా మొదలవుతాయి. అయితే అటవీశాఖలో కొందరు అధికారుల ధోరణితో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగూడెంలో ఉపరితల బొగ్గుగని తవ్వకాలకు అటవీ అనుమతి దరఖాస్తు 2016 నుంచీ పెండింగ్‌లో ఉండటం మచ్చుకో ఉదాహరణ.
రహదారులకు, విద్యుత్తు సౌకర్యానికి: రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో అనేక జనావాసాలు ఉన్నాయి. అక్కడి ప్రజల కోసం రోడ్లు, విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దాదాపు 232 అటవీ ఆవాసాలకు త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గిరిజన, విద్యుత్తుశాఖల అధికారులు అటవీ శాఖవారితో అనేకసార్లు సమావేశమైనా అనుమతుల పరంగా జాప్యం జరుగుతూనే ఉంది. ఇందులో 182 ఆవాసాలు రిజర్వు ఫారెస్టులో, మిగిలినవి రక్షిత అటవీ ప్రాంతం వెలుపల ఉన్నాయి.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ ఆవాసాలు అధికంగా ఉన్నాయి. సుమారు 181 రహదారుల నిర్మాణమూ అటవీ అనుమతుల కోసం ఎదురుతెన్నులు చూస్తోంది. ఇందులో జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు సైతం ఉన్నాయి.
అధికారి తీరుపై పీఎంవోకు ఫిర్యాదు: అటవీ అనుమతుల ఆలస్యం కారణంగా పనులు మొదలుకావడం లేదని.. అటవీశాఖలో ఓ డీసీఎఫ్ హోదాలోని అధికారే కారణమంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి రెండు వారాల క్రితం ఓ ఫిర్యాదు వెళ్లింది. సదరు అధికారి ఎన్నో ఏళ్లుగా బదిలీ లేకుండా ఒకేచోట పనిచేస్తున్నారని.. అనేక దరఖాస్తుల్ని సంవత్సరాల పాటు నిరీక్షణ(వెయిటింగ్)లో పెడుతుండటంతో అనుమతులు రావట్లేదని, ఇలా చేయడం వెనుక అవినీతి ఉన్నట్లు కనిపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై విచారణకు కమిషన్ ఏర్పాటుచేయాలని పీఎంవోకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. అటవీ అనుమతులు లభించని 74 ప్రతిపాదనల ఫైల్ నంబర్ల వివరాల్ని ఫిర్యాదులో జతచేశారు. అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుల్ని అటవీ, పర్యావరణ అనుమతులకు సంబంధించిన పరివేశ్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయడంలో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. పారదర్శకంగా, త్వరితగతిన పరిష్కరించాలన్న లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇందులో అనేక దరఖాస్తులు ఆరేళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నాయి.. అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: 'తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు'