Explosive Trace Detectors: జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలు అమర్చుతున్న బాంబులను గుర్తిస్తున్న కేంద్ర, రాష్ట్ర పోలీసులకు రసాయన, ప్లాస్టిక్ బాంబులు కొరకురాని కొయ్యగా తయారయ్యాయి. మెటల్ డిటెక్టర్లలోనూ పేలుడు పదార్థాల ఆనవాళ్లు రాకపోవడంతో పోలీసులు రసాయన, ప్లాస్టిక్ బాంబులను గుర్తించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను పెంచాలంటూ రాష్ట్రాలకు కేంద్ర నిఘా వర్గాలు ఇటీవల ఆదేశాలు జారీ చేశాయి.
ప్రధానంగా విమానాశ్రయాలు, షాపింగ్‌మాళ్లలో ప్లాస్టిక్, రసాయన బాంబులను ఉగ్రవాదులు అమర్చే అవకాశాలున్నాయని, వాటిని గుర్తించే ఆధునిక డిటెక్టర్లను సమకూర్చుకోవాలంటూ సూచించాయి. నిఘావర్గాల ఆదేశాలతో కేరళ, కోల్‌కతా, ముంబయి విమానాశ్రయాల్లో అత్యాధునిక స్కానర్లను విమానాశ్రయ అధికారులు సమకూర్చుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లోనూ డిటెక్టర్లను మరింత నవీకరించనున్నారు. కేరళలోని రెండు విమానాశ్రయాల్లో ప్లాస్టిక్, రసాయన బాంబులను గుర్తించేందుకు ప్రత్యేకమైన స్కానింగ్ యంత్రాలను సమకూర్చుకున్నారు. కేరళలోని ఓ విమానాశ్రయంలో ఏడాదిన్నర క్రితం అత్యాధునిక ఎక్స్‌ప్లోజివ్ వేపర్ డిటెక్టర్‌ను అధికారులు సమకూర్చుకున్నారు. అమెరికాలో తయారైన ఈ డిటెక్టర్ ప్లాస్టిక్, రసాయన బాంబులున్న సంచులను వాసన ఆధారంగా ఏడు సెకన్లలోనే గుర్తిస్తుంది. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక బాడీ, లగేజ్ స్కానర్లను కొద్దినెలల క్రితం ఏర్పాటు చేశారు.