Tension in Chandrababu East Godawari Tour: ఇదేమి ఖర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన కార్యక్రమాన్ని... మూడోరోజు పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనపర్తి దేవీచౌక్ సెంటర్ లో... చంద్రబాబు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. సామర్లకోట పర్యటన ముగించుకుని... అనపర్తి బయలుదేరిన చంద్రబాబు అనపర్తి రాకుండా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
బలభద్రపురంలో పోలీసులు రోడ్డుకు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ టీడీపీ కార్యకర్తలు ముందుకు సాగారు. ఈ క్రమంలో పోలీసుల తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. తర్వాత చంద్రబాబు కాన్వాయ్... బలభద్రపురం నుంచి అనపర్తికి పయనమవగా పోలీసులు ఏకంగా రోడ్డుపై భైఠాయించి... అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకు దిగిన పోలీసులను కార్యకర్తలు బుజ్జగించి... ముందుకు సాగారు. ఈ క్రమంలో పరస్పరం తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
చంద్రబాబు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా... కాన్వాయ్‌ని ముందుకు సాగుతుండడం పట్ల తీవ్ర అసహనానికి గురైన పోలీసులు... మరో ప్రాంతంలో ఏకంగా పోలీసుల వాహనం, లారీని అడ్డుగా పెట్టారు. కాన్వాయ్ ముందుకు వెళ్లడానికి వీల్లేదంటూ కానిస్టేబుళ్లు, సీఆర్ఫీఎఫ్ సిబ్బందిని అడ్డుగా నిలబెట్టారు. పోలీసుల తీరుపై.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రోడ్ షోకు అనుమతి ఇచ్చి మళ్లీ ఎలా రద్దు చేస్తారని నిలదీశారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నామన్న ఆయన... ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు ముందుకొస్తే పోలీస్ స్టేషన్లు కూడా పట్టవని హెచ్చరించారు.
అయినప్పటికీ... పోలీసులు రోడ్డుకు అడ్డుగా పెట్టిన వాహనాలను తొలగించకపోవడం వల్ల చంద్రబాబు తన వాహనం దిగి... కాలినడకన అనపర్తి బయలుదేరారు. సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో నడిచారు. ఈ క్రమంలో... చంద్రబాబును అడ్డుకునేందుకు మరో ప్రయత్నం చేసిన పోలీసులు... లక్ష్మీనరసాపురం వద్ద మరో బస్సును అడ్డంగా ఉంచారు. అక్కడ ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పోలీసు వాహనాన్ని దాటి చంద్రబాబు ముందుకు కదిలారు.
మరోవైపు చంద్రబాబు సభలో పాల్గొనేందుకు... అనపర్తి దేవీచౌక్ సెంటర్‌కు వచ్చేందుకు యత్నించిన తెలుగుదేశం కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టగా... వాటిని పక్కకునెట్టేసిన వందలాది కార్యకర్తలు దేవీచౌక్‌కు చేరుకున్నారు. చంద్రబాబును మార్గమధ్యలో అడ్డుకుంటున్నారనే సమాచారంతో బలభద్రపురం బయలుదేరారు. చివరకు అంతా కలిసి... అనపర్తి దేవీచౌక్‌కు చేరుకున్నారు.
ఇవీ చదవండి: