వేసవి భానుడి సెగలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా జన్నారం (మంచిర్యాల జిల్లా)లో 44.5 డిగ్రీల సెల్సియస్, కోల్వాయి (జగిత్యాల), నేరెళ్లలో 44.4 చొప్పున, రామగుండంలో 43.4, హైదరాబాద్‌లో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో ఇవే అత్యధికం. రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రత జన్నారంలో నమోదైందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. సోమ, మంగళవారాల్లో మరో 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందన్నారు.
వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట అత్యధికంగా నిజామాబాద్‌లో 30.6 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలను మించడం ఇదే తొలిసారి. రామగుండంలో 28.6, హైదరాబాద్‌లో 27.1 డిగ్రీలుంది. మెదక్ మినహా ఇతర ప్రాంతాల్లో గాలిలో తేమ బాగా తగ్గి పొడి వాతావరణం ఏర్పడి.. రాత్రిపూట సైతం జనం ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్‌లో మాత్రం రాత్రిపూట ఉష్ణోగ్రత 21.6 డిగ్రీలే ఉంది. మరోవైపు అండమాన్ దీవులకు దక్షిణంగా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత తీవ్రమై ఈ నెల 7 తరవాత వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఏమీ ఉండదని రాజారావు పేర్కొన్నారు. మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి: లాక్డౌన్ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష