Bifurcation Issue Meet: తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజనాంశాలతో పాటు విభజన చట్టంలోని అంశాలపై ఇవాళ కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట దిల్లీలో ప్రత్యక్ష సమావేశం అనుకున్నప్పటికీ కొవిడ్ కేసుల నేపథ్యంలో సమావేశాన్ని దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ తొమ్మిది అంశాలను ఎజెండాలో పొందుపర్చింది. విభజన చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఏపీ-ఎస్ఎఫ్సీ విభజన, సింగరేణి కార్పొరేషన్‌తో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన, దిల్లీ ఏపీ భవన్ విభజన, విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం పన్ను బకాయిలు, బ్యాంకు డిపాజిట్లలో మిగిలిన నగదు పంపకాల అంశాలు ఎజెండాలో ఉన్నాయి.
సిఫారసుల ప్రకారం...
సింగరేణి కార్పొరేషన్‌తో పాటు సంస్థకు అనుబంధంగా ఏపీలో ఉన్న అప్మెల్ విభజన వ్యవహారంలో ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటార్నీ జనరల్ న్యాయసలహా ఇచ్చారు. దానిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. తొమ్మిదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనకు సంబంధించి షీలాబిడే కమిటీ సిఫారసుల్లో అభ్యంతరం లేని వాటిపై ముందుకెళ్లి మిగతా వాటి విషయంలో విడిగా చర్చించాలని తెలంగాణ అంటోంది. అన్ని సంస్థల విషయంలో ఒకే విధంగా ముందుకెళ్లాలని ఏపీ వాదిస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప మిగతా వాటి విషయంలో షీలాబిడే కమిటీ సిఫారసుల ప్రకారం ముందుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సూచించింది.
జనాభా ప్రాతిపదికన...
ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ తదితర పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు, సుప్రీంతీర్పు విషయంలో రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. ఏపీ ఆర్థికసంస్థ విభజన ప్రతిపాదనలను ఏకపక్షంగా తయారు చేశారని తెలంగాణ అంటోంది. పన్నుల వసూళ్లు, రీఫండ్‌ను జనాభా ప్రాతిపదికన పంచాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. స్థానికత ప్రాతిపదికన ఏపీకి కేవలం రూ. 3,021 కోట్లు మాత్రమే వస్తాయని, జనాభా ప్రాతిపదికన రూ. 6,841 కోట్లు వస్తాయని చెప్తోంది. ఈ ప్రతిపాదనతో విభేదిస్తోన్న తెలంగాణ... విభజన చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాలని లేదంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని చెబుతోంది.
ఏపీ వాదనలు...
దిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. అవసరాల కోసం ప్రతిష్టాత్మకంగా ఓ కొత్త భవనాన్ని నిర్మించాలని తెలంగాణ భావిస్తోంది. అవసరమైతే కొంత మొత్తాన్ని ఏపీకి చెల్లించేందుకు సిద్ధపడుతోంది. విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణ నుంచి రూ. 7,500 కోట్లు రావాలని ఏపీ వాదిస్తోంది. నిర్ధిష్ట గడువులో బకాయిల చెల్లింపు విషయమై అండర్ టేకింగ్ ఇస్తే ఎన్సీఎల్టీలో కేసు ఉపసంహరించుకునేందుకు సిద్ధమేనని ఏపీ తేల్చిచెప్పింది. చట్టంలో పొందుపరచని సంస్థల విభజన, బ్యాంకు డిపాజిట్లలో ఉన్న నగదు విభజన, పన్ను ఆదాయం పంపిణీ తదితర అంశాలపైనా సమావేశంలో చర్చ జరగనుంది.
ఇతర అంశాలపైనా...
విభజనచట్టంలోని హామీల అమలు సహా ఇతర అంశాలు, వాటి పురోగతిపైనా సమావేశం చర్చించనుంది. సమావేశంలో చర్చించేందుకు మరో పది అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. 2014-15 మధ్య వనరుల వ్యత్యాసం, పోలవరం ప్రాజెక్టు, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు, కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖ-విజయవాడ-తిరుపతి విమానాశ్రయాల విస్తరణ, రామాయపట్నం పోర్టు అభివృద్ధి, వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, పన్ను ప్రోత్సాహాకాలు అందులో ఉన్నాయి.
సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై అధికారులకు కేసీఆర్ ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు. విభజన చట్టంలోని అంశాలకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంటేనే సహకరించాలని, లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదని కేసీఆర్ వారికి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇదీ చూడండి: