విదేశాల నుంచి వచ్చి దిల్లీ, హరియాణాల్లో క్వారంటైన్ పూర్తి చేసుకొని ఆరోగ్యంగా ఉన్న వారిని స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పలువురు తెలుగువారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చిన వందలాది మంది తెలుగువారు దిల్లీలోని పలు ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి ఈ నెల 5న క్వారంటైన్ గడువు ముగిసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లడానికి వీలులేకుండా ఉందని అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్వస్థలాలకు పంపించేందుకు చొరవ చూపాలని ఏపీ, తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు వారు విజ్ఞప్తి చేశారు.
పరిస్థితి ఇబ్బందికరం..
ఇటలీ నుంచి వచ్చిన వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. మార్చి 20, అంతకుముందు మిలన్, రోమ్‌ల నుంచి వచ్చిన వందలాది మందిని హరియాణాలోని మనేసర్‌లో క్వారంటైన్‌లో ఉంచారు. అనంతరం వీరిని చావ్లాలోని ఐటీబీటీ క్యాంపునకు తరలించారు. క్వారంటైన్ పూర్తయిన అనంతరం దిల్లీ, పరిసర ప్రాంతాలవారు ఇళ్లకు వెళ్లిపోయారు. కర్ణాటక తదితర ప్రాంతాలవారు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాట్లతో స్వస్థలాలకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రం చావ్లా ఐటీబీటీ క్యాంపునకే పరిమితమయ్యారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత ఇటలీ నుంచి వచ్చినవారిలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించగా... తమని మరో 14 రోజులు క్వారంటైన్ చేయాలని అధికారులు సూచించారని వారు చెబుతున్నారు.‘‘ఇటలీలోనే పరీక్షలు నిర్వహించారు.
మా గురించి ఆలోచించండి..
పాజిటివ్ లక్షణాలు లేకపోయినా.. దిల్లీ వచ్చాక క్వారంటైన్‌కు అంగీకరించాం. కుటుంబసభ్యులు, ప్రజల క్షేమం కోరి 14రోజులు క్వారంటైన్‌లో ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాం. క్యాంపులో సదుపాయాలు బాగానే ఉన్నా.. కేవలం ఒక మాస్కు ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇటలీ నుంచి వచ్చారు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాలి అన్నట్లుగా ఉంది. ఇళ్లకు పంపితే సెల్ఫ్‌క్వారంటైన్ పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. గదులకు తలుపులు లేవు. గదిలో ఆరుగురిని దూరంగా ఉంచుతున్నారు. కేవలం మాస్క్‌తో మమ్మల్ని మేం రక్షించుకోవడం సాధ్యంకాదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మా గురించి ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి’’అని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇది చూడండి: డ్రోన్ వీడియో: హైదరాబాద్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?