Lok Sabha Speaker fires over TRS members: తెరాస సభ్యులపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనల పట్ల అభ్యంతరం తెలిపారు. ఆందోళన విరమించి కూర్చోవాలని చెప్పారు. సభ్యులు శాంతించకపోవడం వల్ల లోక్‌సభను అరగంటపాటు వాయిదా వేశారు.
సమావేశాలు ప్రారంభమైన మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంటోంది. పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ తెరాస ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభ్యుల ఆందోళనల నడుమ సభా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుండటం పట్ల స్పీకర్ ఆగ్రహించారు.
TRS members protest: అంతకు ముందు తెరాస ఎంపీలు పార్లమెంటు ఆవరణలో మూడోరోజూ నిరసన కొనసాగించారు. గాంధీవిగ్రహం ముందు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయాలని నినదించారు. కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై గందరగోళానికి సభలోనే తెరపడాలన్నారు. తాము ప్రతిపక్షంతో ఉన్నామన్న ఎంపీ కేశవరావు.. 12 మంది రాజ్యసభ సభ్యులపైనా సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిన్న కూడా తెరాస ఎంపీల నిరసనకు దిగారు. ఉదయాన్నే ఉభయ సభల్లో తెరాస ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ధాన్యం సేకరణలో జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరదలు, పంట నష్టాలకు పరిహారంపై చర్చించాలని నోటీసులు సమర్పించారు. రాజ్యసభలో ఎంపీ కేకే, లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నోటీసులు అందించారు.
rajya sabha adjourned: మరోవైపు రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలంటూ తెరాస ఎంపీల నిరసనకు దిగారు. రాజ్యసభలో తెరాస ఎంపీలు సంతోష్, సురేష్ రెడ్డి, లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ నిరసన చేపట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలకు ఛైర్మన్ వాయిదా వేశారు.
ఇవీ చూడండి: