Street dogs issue in KPHB colony: కూకట్‌పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో తలెత్తిన వీధి కుక్కల బెడద.. పోలీసు ఎఫ్ఐఆర్లతో పాటు దిల్లీలోని ఓ ఎంపీ జోక్యానికి దారి తీసింది. దీంతో ఈ సమస్య కమ్యూనిటీ వాసులకు కొరకరాని కొయ్యగా తయారైంది. ఈ బాధలు భరించలేక... మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆ గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
వెంటపడి గాయపరిచి
మలేషియన్ టౌన్షిప్ రెయిన్ ట్రీ గేటెడ్ కమ్యూనిటీ పార్కులో గత సంవత్సరం నుంచి వీధి కుక్కల బెడద ఎక్కువైందని ఆ కాలనీ వెల్ఫేర్ అధ్యక్షుడు సురేష్ అన్నారు. కాలనీలో వీధి కుక్కలు ఎక్కువవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనాల వెంటపడేవని పేర్కొన్నారు. ఈ క్రమంలో వాటి బెడద భరించలేక ఓ సంస్థకు కుక్కలను దత్తతకు ఇచ్చి వాటిని అక్కడి నుంచి తరలించినట్లు వివరించారు.
దూషిస్తున్నారు
మా టౌన్షిప్లో 20 శునకాలు ఉన్నాయి. అందులో 5 మాత్రమే మాకు చెందినవి. పీఎఫ్ఏ సంస్థకు చెందిన కొందరు.. వీధి కుక్కలను మచ్చిక చేసుకొని ఎవరూ లేని సమయంలో మా కమ్యూనిటీలో వదిలేస్తున్నారు. వీటి ద్వారా మాకు చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని గాయపరిచింది. ఏం చేయాలో తోచక వీటిని ఓ సంస్థకు అప్పగించాం. దీంతో పీఎఫ్ఏ ప్రతినిధులు మాపై పోలీసు కేసులు పెట్టారు. పీఎఫ్ఏ నిర్వాహకురాలు మేనక గాంధీ మమ్మల్ని బెదిరిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మా సమస్యను పరిష్కరించాలి. -సురేశ్, కమ్యూనిటీ వెల్ఫేర్ అధ్యక్షుడు
ఈ విషయమై పీపుల్స్ ఫర్ యానిమల్స్(పీఎఫ్ఏ) సంస్థ ప్రతినిధులు.. కుక్కల దత్తతు అక్రమంగా చేశారని కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఎఫ్ఏ వ్యవస్థాపకురాలు, ఎంపీ మేనకగాంధీ.. తమకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమను బెదిరించారని ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపించాలని కమ్యూనిటీ వాసులు వేడుకున్నారు.
ఇదీ చదవండి: Govt land kabza in Banjara Hills: రూ.220కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. కేసు నమోదు