Apprenticeship for degree students: పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతోపాటు స్టయిపెండ్ పొందే అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్) విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇప్పటివరకు ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకే ఈ అవకాశం ఉండేది. దానిని డిగ్రీ విద్యార్థులకు విస్తరిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2025-26 వరకు అమల్లో ఉంటుంది.
National New Education Policy 2021: నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్) కింద ఈ శిక్షణ అందిస్తారు. దేశవ్యాప్తంగా వచ్చే అయిదేళ్లలో మొత్తం 9 లక్షల మందికి అవకాశం ఇస్తారు. అందుకు రూ.3,054 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సాంకేతిక విద్యతోపాటు సంప్రదాయ కోర్సుల విద్యార్థుల్లోనూ ఉద్యోగ నైపుణ్యాలను పెంచాలని జాతీయ నూతన విద్యా విధానం సిఫారసు మేరకు ఈసారి పథకాన్ని డిగ్రీ విద్యార్థులకూ విస్తరించారు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విద్యార్థులకు విద్యలో భాగంగా అసలు ప్రాక్టికల్స్ చేయించడం లేదని, ఉద్యోగాలకు పనికొచ్చేలా ఆయా కళాశాలలు తీర్చిదిద్దడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారికి కూడా అప్రెంటిస్‌షిప్ కల్పించడం చాలా ప్రయోజనకరమని నిపుణులు భావిస్తున్నారు. సంప్రదాయ డిగ్రీతో ఉద్యోగావకాశాలు తక్కువ ఉన్న నేపథ్యంలో ఆ కోర్సుల్లోని విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి మాజీ కార్యదర్శి మూర్తి ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ఉత్పత్తి తరహా పరిశ్రమల్లో శిక్షణ
ఉత్పత్తి తరహా కంపెనీల్లోనే అధిక శాతం మందికి అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, వైద్య పరికరాల తయారీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్/టెక్నాలజీ ఉత్పత్తులు, ఆటో మొబైల్‌తోపాటు గతిశక్తి పథకం కింద లాజిస్టిక్ తదితర రంగాల్లో మానవ వనరులను తయారు చేయడానికి శిక్షణ ఇవ్వనున్నారు.
విద్యార్థులకు ఇదీ ఉపయోగం
Board of Apprenticeship Training: చదువు పూర్తయిన విద్యార్థులకు బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ (బోట్) కార్యాలయం అన్ని రాష్ట్రాల్లో...ఆయా కళాశాలల్లో అప్రెంటిస్‌షిప్ మేళాలు జరుపుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బోట్ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి వాటిని నిర్వహించాలి. మేళా సమయంలో పరిశ్రమల ప్రతినిధులు హాజరై విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. ఆ సమయంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి నెలకు రూ.9 వేలు, ఇతరులకు రూ.8 వేలు స్టయిపెండ్‌గా అందజేస్తారు. అందులో సగం కేంద్రం నాట్స్ ద్వారా అందజేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆయా కంపెనీలు ఇస్తాయి. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏడాదిపాటు పని అనుభవంతోపాటు కొంతవరకు వేతనం కూడా పొందుతారు. శిక్షణలో విద్యార్థుల పనితీరు నచ్చితే ఆయా కంపెనీలు వారికి శాశ్వత ఉద్యోగం ఇస్తాయి.
ఇవీ చదవండి: