ఆంధ్రప్రదేశ్లోని మాచర్లలో వైసీపీ దమనకాండను తెలుగుదేశం అధినేత తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టడం దారుణమన్న చంద్రబాబు వైసీపీ శ్రేణులకు పోలీసులు కొమ్ముకాయడం ఇంకా దారుణమని ధ్వజమెత్తారు. వైసీపీ గూండాలు విధ్వంసం చేస్తుంటే పోలీసులేం చేస్తున్నారన్న ఆయన.. ఎస్పీ, డీజీపీ ఎక్కడున్నారు..? ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి మాచర్ల ఘటన నిలువుటద్దమన్న చంద్రబాబు.. వైసీపీ నేతలు ఇంతకింత మూల్యం చెల్లించక తప్పదన్నారు.
మాచర్ల మంటలు సీఎం జగన్‌తో పాటు ఆయన ప్రభుత్వాన్ని దహించడం ఖాయమని హెచ్చరించారు. అంతకుముందు గుంటూరు డీఐజీకి ఫోన్ చేసి తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్లలో పోలీసుల సహకారంతో వైసీపీ రౌడీ మూకలు మరోసారి తెలుగుదేశం శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనమని ధ్వజమెత్తారు.
దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసిన పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీఛార్జ్ చెయ్యడం, జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం అధికార పార్టీకి కొమ్ముకాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలన్న ఆయన గాయపడిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వైసీపీ విధ్వంసకాండను తీవ్రంగా ఖండించిన పలువురు తెలుగుదేశం సీనియర్ నేతలు.. ఘటనకు హోం మంత్రి, డీజీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మాచర్ల ఘటనపై నేడు నరసరావుపేటలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయాలని నేతలను ఆదేశించారు. అనంతరం మాచర్ల వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.
ఇవీ చదవండి: