లాసెట్ - 2019 షెడ్యూల్ ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. పరీక్ష షెడ్యూలు, సిలబస్, ఇతర అంశాలపై చర్చించేందుకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి నేతృత్వంలో, మండలి వైస్ ఛైర్మన్, ఓయూ వీసీ రామచంద్రం, కన్వీనర్ జీబీరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు మార్చి 10న జారీ కానున్నట్లు కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో మే 16 వరకూ అవకాశం కల్పిస్తామన్నారు. లాసెట్‌కు ఎస్సీ, ఎస్టీలకు 500 రూపాయలు, ఇతరులకు 800 రూపాయలు దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. పీజీ ఎల్ సెట్‌కు ఎస్సీ, ఎస్టీలు 800 రూపాయలు, మిగతావారు వెయ్యి రూపాయలు చెల్లించాలని కన్వీనర్ వివరించారు.ఆన్లైన్లో పరీక్షలు
మే 17 నుంచి ఆన్లైన్లో హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని అభ్యర్థుల గమనించాలని సూచించారు. మే 20 ఉదయం పది నుంచి పదకొండున్నర వరకూ ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయని.. ఈ సారి ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.